జనసేనపైన కూడా బెట్టింగ్ ?

వినటానికే ఆశ్చర్యంగా ఉన్న నిజంగా జరుగుతోందదే. అయితే జనసేన అధికారంలోకి వచ్చే విషయంలో పందేలు కాయటం లేదులేండి ఎవరూ. పలానా సీట్లో జనసేన గెలుస్తుందంటూ మాత్రం పందేలు కడుతున్నారు. కృష్ణా, ఉభయగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోని కొన్ని సీట్లలో జోరుగా జనసేనకు మద్దతుగా బెట్టింగ్  జరుగుతున్నదైతే వాస్తవం.

పోలింగ్ జరిగిన వెంటనే జనసేన పనైపోయిందనే అనుకున్నారు అందరూ. అయితే కొద్ది రోజులు పోయిన తర్వాత  అసలు వివరాలు మెల్లిగా బయటకు వస్తున్నాయ్.  పోలింగ్ కేంద్రాల వారీగా జనసేన నేతలు కూడా లెక్కలు కట్టారు. దాంతో కొన్ని స్ధానాల్లో జనసేన అభ్యర్ధులు గెలుస్తారనే నమ్మకం వచ్చిందిట. దాంతో బెట్టింగులకు రెడీ అయిపోయారు.

అభ్యర్ధుల గెలుపుపై కొన్ని నియోజకవర్గాల్లో పందేలు కాస్తుంటే మరికొన్ని ప్రాంతాల్లో జనసేన మద్దతు లేనిదే ప్రభుత్వం ఏర్పడదనే విషయంపైన కూడా పందేలు కాస్తున్నారు. ఈ విషయంలో కొందరు జనసేన నేతలు అతికి పోతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి లేండి.

పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం, తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు, కృష్ణా జిల్లాలోని పెడన, అవనిగడ్డ, విజయవాడ తూర్పు నియోజవకవర్గాలపై బెట్టింగ్ జరుగుతోంది. అన్నట్లు పవన్ గెలుపుపై పోటీ చేసిన భీమవరం, గాజువాకలో కూడా బెట్టింగ్ జోరుగా జరుగుతోందట.  జనసేనపైన కూడా బెట్టింగ్ కడుతున్నారంటే బెట్టింగ్ రాయళ్ళ నమ్మకం ఏమిటో ?