చంద్రబాబునాయుడు కేంద్రంతో ప్రత్యక్ష యుద్ధానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లే కనిపిస్తోంది. కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వచ్చే అవినీతి ఆరోపణలపై దాడులు చేయటం, విచారించటానికి ఏసిబి సిద్ధంగా ఉండాలంటూ డిజిపి ఆర్ పి ఠాకూర్ ఈరోజు ఆదేశాలు జారీ చేయటం విచిత్రంగా ఉంది. ఏసిబి ఉన్నతాధికారులతో ఠాకూర్ ఈరోజు కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో దాడులకు, విచారణకు సిబిఐకి చంద్రబాబు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. మామూలుగా అయితే, కేంద్రప్రభుత్వ ఉద్యోగులపై వచ్చే అవినీతి ఆరోపణలకు సంబంధించి సిబిఐ మాత్రమే దాడులు చేస్తుంది.
తాజాగా కేంద్రానికి చంద్రబాబుకు మధ్య సంబంధాలు చెడిన నేపధ్యంలో రాష్ట్రంలోకి సిబిఐ ప్రవేశాన్ని చంద్రబాబు అడ్డుకున్నారు. సిబిఐని అడ్డుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. అంటే రాష్ట్రంలో ఎవరిపైనైనా ఇకపై సిబిఐ దాడులు చేయాలంటే ముందుగా రాష్ట్రప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేశారు చంద్రబాబు. అయితే, ఎవరిపైనైనా వచ్చిన ఆరోపణల విషయంలో హై కోర్టు గనుక విచారణకు ఆదేశిస్తే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సిబిఐ నేరుగా విచారణ మొదలుపెట్టవచ్చు.
ఈ విషయంలో చంద్రబాబు నిర్ణయాన్ని కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ తప్పు పట్టిన సంగతి తెలిసిందే. అయితే, మాట్లాడాల్సిన హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాత్రం మౌనంగానే ఉన్నారు. కేంద్ర-చంద్రబాబు మధ్య మొదలైన తాజా వివాదం ఎలా ముగుస్తుందో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఈ నేపధ్యంలోనే ఠాకూర్ కీలక సమావేశం పెట్టి ఆదేశాలివ్వటం ఆశ్చర్యంగా ఉంది. కేంద్రప్రభుత్వ ఉద్యోగులపైన వచ్చే ఆరోపణలకు దాడులు చేయటంతో పాటు విచారణకు సిద్ధంగా ఉండాలని ఠాకూర్ ఆదేశాలిచ్చారు. ఠాకూర్ ఆదేశాలివ్వటం వరకూ ఓకే. కానీ అందుకు కేంద్రం అంగీకరించాలి కదా ? కేంద్రప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేసే అధికారం ప్రస్తుతానికి ఏసిబికి లేదు.
సిబిఐ దాడులను అడ్డుకునే అధికారం రాష్ట్రప్రభుత్వానికి ఉండొచ్చు. కానీ కేంద్రప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేసి కేసులు పెట్టి విచారణ చేసే అధికారం రాష్ట్రప్రభుత్వానికి ఉందా అన్నదే సందేహం. సిబిఐ దాడులను చంద్రబాబు అడ్డుకున్న నేపధ్యంలో ఏసిబి దాడులను మాత్రం కేంద్రం ఎందుకు ఒప్పుకుంటుంది ? జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ప్రచ్ఛన్నయుద్ధానికి దారితీసేట్లే కనబడుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మొదలైన ఈ సమస్య ఎక్కడిదాకా వెళుతుందో ఎవరికీ అర్ధం కావటం లేదు.