2019 ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డికి, ఉన్నత స్థాయిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు నిత్యం ఎదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. మొదట్లో ఐపీఎస్, ఐఏఎస్ అధికారులతో కూడా జగన్ కు గొడవలు జరిగాయి. అయితే ఇప్పుడు ఆయన తీసుకున్న ఒక నిర్ణయం మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆశ్చర్యంలో ముంచేసింది. గతంలో జగన్ తో గొడవ పెట్టుకున్న సీనియర్ ఐపీఎస్ అధికారి, మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను ఆర్టీసీ ఎండీగా నియమించారు. ఈ విషయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.
ఠాకూర్ తో జగన్ సంబంధం
గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఠాకూర్ డీజీపీగా ఉన్నారు. ఈ సమయంలో జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేసిన సమయంలో విశాఖలో ఆయనపై కోడికత్తి దాడి జరిగింది. ఈ సమయంలో వైసీపీ నేతలే దీనికి కారణమంటూ.. ఠాకూర్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ పరిణామం.. ఠాకూర్‌కు వైసీపీకి మధ్య నిప్పుల కుంపటి రాజేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఠాకూర్‌ను ఉన్నపళాన.. సీఎం జగన్ బదిలీ చేశారు. ఎలాంటి ప్రాధాన్యతా లేని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగంలో ఎండీగా నియమించారు.
ఈ నిర్ణయం వెనక ఉన్న వ్యూహమేంటి!!
సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం వెనక ఒక వ్యూహముందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. జగన్ ప్రభుత్వానికి మొదట నుండి కూడా ఉన్నత పదవుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులతో గొడవలు ఉన్నాయి. ఆ గొడవలకు చెక్ పెట్టడానికే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని, తమకు అనుకూలంగా ఉంటే ఊహించని విధంగా సహకారం ఉంటుందని మిగితా అధికారులకు తెలియచెప్పడానికే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.