పవన్ కళ్యాణ్‌కి ఢిల్లీ పెద్దలు ఏం చెప్పినట్టు.?

రోడ్ మ్యాప్ అడిగారా.? పొత్తుల చర్చలు ఏమైనా జరిపారా.? చంద్రబాబు ప్రస్తావన వచ్చిందా.? లేదా.? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత, ఆయన ఢిల్లీ టూర్ విషయమై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ పెద్దలు కొందరితో జనసేనాని భేటీ అయిన మాట వాస్తవం. కానీ, ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ అయితే దొరకలేదు. ‘చర్చించాం.. చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయి..’ అని సెలవిచ్చారు పవన్ కళ్యాణ్.. అదీ సినిమాటిక్‌గా.!

‘మీరు అడిగినప్పుడు కాదు, నేను చెప్పాలనుకున్నప్పుడు చెబుతాను..’ అంటూ పొత్తుల వ్యవహారాల గురించి మీడియా అత్యుత్సాహంపై సెటైర్లు కూడా వేశారు. ఇంతకీ, బీజేపీ పెద్దలు పవన్ కళ్యాణ్‌కి ఏం చెప్పినట్లు.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్. ‘వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్..’ అని పవన్ కళ్యాణ్ నినదిస్తున్నారు. ఇదే నినానాదాన్ని ఏపీ బీజేపీ నేతలు కొందరు భుజానికెత్తుకున్నారు. అయితే, బీజేపీ అధినాయకత్వం మాత్రం, వైసీపీతో సన్నిహిత సంబంధాలే కొనసాగిస్తోంది. అలా చూస్తే, పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్‌లో ‘ఆ ఒక్కటీ అడగొద్దు’ అని స్వీట్ వార్నింగ్ పవన్ కళ్యాణ్‌కి ఇచ్చినట్లే అర్థం చేసుకోవాలేమో.

‘చంద్రబాబునీ కలుపుకుపోదాం.. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా చేద్దాం..’ అని పవన్ కళ్యాణ్ ప్రతిపాదిస్తే, ‘ఇప్పుడైతే అలాంటి ప్రస్తావన వద్దు..’ అని తేల్చేశారట. చేసేది లేక, తిరుగు ప్రయాణంలో హైద్రాబాద్ వెళ్ళిపోయి, ఎంచక్కా సినిమాలు చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్. అదేంటీ, వీకెండ్ అయినా ఏపీలో రాజకీయం చేయాలి కదా.? కానీ, ఏం చేస్తారు.. సినిమాల్లో క్షణం తీరిక లేకుండా పోయిందాయె.!