ఖండించాల్సిన చోట మండించారు… రిస్క్ లో పెట్టేశారు!?

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ వ్యక్తుల పైనా.. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులపైనా.. దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ దారుణమైన చర్యలను అటు విపక్షాలు, ప్రజా సంఘాలు, మానవత్వ విలువలున్న వారూ ఖండిస్తున్నారు! ఈ క్రమంలోనే తాజాగా ఏపీలో ఈసారి ఏకంగా ఓ పత్రికా కార్యాలయంపైనే దాడి జరిగింది. దీన్ని ప్రజాస్వామ్య వాదులంతా ముక్తకంఠంతో ఖండించారు.

“విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూటమి యూటర్న్” అని అంటూ ఆంగ్ల దినపత్రిక డెక్కన్ క్రానికల్ లో ఓ కథనం ప్రచురితమయ్యింది. దీంతో… ఆగ్రహించిన తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల కార్యకర్తలు ఆ పత్రికాఫీసుపై దాడి చేశారు. ఈ సందర్భంగా డీసీ ఆఫీసులో ఫర్నిచర్ ధ్వంసం చేశారని తెలుస్తోంది. సిబ్బందితో వాగ్వాదానికి దిగినట్లు చెబుతున్నారు.

ఈ దుశ్చర్యలో టీ.ఎన్.ఎస్.ఎఫ్., తెలుగు మహిళా శ్రేణులూ మెడలో పసుపు కండువాలు వేసుకుని పత్రికాఫీసుపై దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆఫీసు ముందున్న బోర్డును తగులబెట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి కూటమి సిద్ధంగా లేదని.. అలాంటి ఛాన్సే లేదని.. అలా జరిగితే అప్పుడు అడగండి అని వారేమీ భరోసా ఇవ్వలేదు కానీ… ఆ కథనం రాయడాన్ని మాత్రం తప్పుబట్టారు!

ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను “ఎక్స్” లో పోస్ట్ చేసింది డెక్కన్ క్రానికల్. ఈ సందర్భంగా… ఈ దాడిని ఖండిస్తూ, ఇలాంటి బెదిరింపులకు భయపడబోమని డీసీ విలేఖరులు తెలిపారు. అతిపెద్ద మెజారిటీ అనేది హింసకు లైసెన్స్ కాదని చురకలు అంటించారు! ఈ దాడిని జర్నలిస్టు సంఘాలూ తీవ్రంగా ఖండించాయి!

ఇదే సమయంలో… టీడీపీకి చెందిన వ్యక్తులు పిరికితనంతో డీసీ కార్యాలయంపై చేసిన దాడికి తీవ్రంగా ఖండిస్తున్నాను.. గుడ్డిగా టీడీపీకి వత్తాసు పలకకుండా నిష్పక్షపాతంతో పనిచేసే మీడియాను అణిచివేసేందుకు జరిగిన మరో ప్రయత్నమే ఈ దాడి అని.. కొత్త ప్రభుత్వ హయాంలో ఏపీలో ప్రజాస్వామ్యం పదే పదే ఉల్లంఘనలకు గురవుతోందని జగన్ అన్నారు.

వైజాగ్ కార్యాలయంలో డెక్కన్ క్రానికల్ డిస్‌ ప్లే బోర్డుపై జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరుతున్నాను అంటూ నారా లోకేష్ రాసుకొచ్చారు. పనిలో పనిగా వైసీపీపై విమర్శలు చేశారు! విశాఖ స్టీల్ ప్లాంట్ కు పూర్వ వైభవం తెస్తామని అన్నారు!

ఆ ఖండనల సంగతి అలా ఉంటే… “విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూటమి యూటర్న్” అనే కథనంపై టీడీపీ కార్యకర్తలు ఈ స్థాయిలో రెచ్చిపోవడంతో సెల్ఫ్ గోల్ వేసుకున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కారణం… ఆరు నూరైనా నూరు ఆరైనా మోడీ అడిగితే చంద్రబాబు “నో”చెప్పే పరిస్థితి ఉండదనేది రాజకీయాల్లో విసృతంగా వినిపిస్తున్న మాట!

ఈ నేపథ్యంలో ఒకవేళ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కూటమి హయాంలో జరగకపోతే… కచ్చితంగా చంద్రబాబును అభినందించి తీరాల్సిందే.. డెక్కన్ క్రానికల్ కథనాన్ని అంతా ముక్తకంఠంతో ఖండించి తీరాల్సిందే! అలా కాకుండా కూటమి హయాంలో ప్రైవేటీకరణ జరిగితే… అప్పుడు చంద్రబాబు, లోకేష్ & కో లు తలలు ఎక్కడ పెట్టుకుంటారనేది ఇప్పుడు మరో చర్చనీయాంశంగా మారింది.

కారణం… తమకు వ్యతిరేకంగా ఓ వార్త వస్తే దాన్ని ఖండిస్తే సరిపోయేది. నమ్మేవారు ఎలాగూ నమ్ముతారు, నమ్మనివారితో సమస్యే లేదు! అలా అనుకుంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి తగులబెట్టే కార్యక్రమాలు ఎన్ని జరిగి ఉండాలనేది మరో కామెంట్! జగన్ ప్రతీ మీటింగ్ లోనూ తమకు వ్యతిరేకంగా తప్పుడు కథనాలు రాసే పత్రికలను విమర్శించేవారే తప్ప.. తగులబెట్టాలనే ఆలోచన చేయలేదు!!

ఈ నేపథ్యంలో… టీడీపీ నేతలు కూడా డీసీ రాసిన కథనంలో వాస్తవం లేదని భావిస్తే, నమ్మితే కశ్చితంగా ఖండించడమో, ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన తెలపడమో, ఆ పత్రిక క్రెడిబిలిటీని ప్రజల మధ్య ఉంచడమో చేసి ఉంటే హుందాగా ఉండే. అలా కాకుండా… ఇలా దాడులకు తెగబడటం అనేది ఏమాత్రం సమార్థనీయం కాదు! పొరపాటున ఆ కథనం రేపు నిజమైతే… తమ్ముళ్లు పెద్ద రిస్క్ చేసినట్లే.. డీసీ లెవెల్ బాగా పెంచినట్లే!!

ఇక్కడ మరో విషయం ఏమిటంటే… ఈ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి అనే సంగతి మరిచిపోయారో.. లేక, తన బాధ్యత అంతా తన శాఖల వరకే అనుకున్నారో కానీ.. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలను పవన్ మరిచిపోయినట్లున్నారని.. ఏపీ ప్రజానికం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేసుకునేలా నడుచుకుంటున్నారనే కామెంట్లూ మరోపక్క వినిపిస్తున్నాయి!