జగ్గారెడ్డి అరెస్టు పై డిసిపి సుమతి ఏం చెప్పారంటే

కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పై పోలీసులు ఎనిమిది సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జగ్గారెడ్డి అరెస్టుపై నార్త్ జోన్ డిసిపి సుమతి వివరాలు వెల్లడించారు.

సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి 2004 లో గుజరాత్ కు చెందిన వారిని తన భార్య పిల్లలుగా చూపించి అమెరికాకు తీసుకెళ్లినట్టు సోమవారం మధ్యాహ్నం మార్కెట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయిందన్నారు. వెంటనే నాలుగు బృందాలుగా ఏర్పడి విచారణ ప్రారంభించామని తెలిపారు. అన్ని వివరాలు తీసుకొని విచారించగా జగ్గారెడ్డి నిజంగానే మానవ అక్రమ రవాణకు పాల్పడినట్టు తేలిందని డిసిపి సుమతి తెలిపారు. అమెరికాకు ముగ్గురిని తీసుకొని వెళ్లిన జగ్గారెడ్డి వచ్చేటప్పుడు మాత్రం ఒకడే వచ్చారన్నారు. భార్య పిల్లల పేర్లతో ముగ్గురిని అమెరికాకు తీసుకెళ్లేందుకు రూ.15 లక్షలు జగ్గారెడ్డి తీసుకున్నారని, తమ విచారణలో ఈ విషయాన్ని జగ్గారెడ్డి ఒప్పుకున్నారని సుమతి తెలిపారు.  ఆధార్ డేటా ఆధారంగా కేసు సులువుగా టేకాఫ్ చేశామని ఇప్పటి వరకు జగ్గారెడ్డి భార్యా పిల్లలకు పాస్ పోర్టులే లేవన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మానవ అక్రమ రవాణా సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. 

మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

జగ్గారెడ్డిపై ఐపీసీ 419,490,467,468,471,370, పాస్ పోర్టు యాక్ట్ సెక్షన్ 12, ఇమ్మిగ్రేషన్ యాక్ట్ 24 సెక్షన్ల కింద మొత్తం 8 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. జగ్గారెడ్డిని పక్కా ఆధారాలతో అరెస్టు చేశామని, రాజకీయ కక్ష్యతో చేశామన్న వార్తలు అవాస్తమని ఆమె కొట్టిపారేశారు. సిటి సివిల్ కోర్టులో జగ్గారెడ్డిని ప్రవేశపెట్టామని అన్నారు. నాన్ బెయిలబుల్ కింద అరెస్టు చేయడంతో జగ్గారెడ్డిని పోలీసు కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరుతామన్నారు. జగ్గారెడ్డిని మరింత లోతుగా విచారించాల్సిన అవసరముందన్నారు. ఇంకా ఇలా ఎంత మందిని అక్రమ రవాణా చేశారో తెలియాల్సి ఉందన్నారు.

ఉదయం గాంధీ ఆస్పత్రిలో జగ్గారెడ్డికి వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం ఆయన మాట్లాడుతూ తాను ఎటువంటి తప్పు చేయలేదని తనపై కక్ష్యతో కేసీఆర్, హరీష్ రావు ఈ చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు.