దత్త పుత్రుడు వర్సెస్ ఆనిముత్తెం.! వైసీపీ వర్సెస్ జనసేన.!

రాజకీయాల్లో విమ్శల స్థాయి నానాటికీ దిగజారిపోతోందని పదే పదే జనం నెత్తీనోరూ బాదుకోవడం తప్ప, రాజకీయ నాయకులు, పార్టీల తీరు మారడం లేదు. ప్రతిసారీ అంతకు మించి.. అనే స్థాయికి దిగజారిపోతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదే పదే ‘దత్త పుత్రుడు..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తున్నారు. దానికి జనసేన పార్టీ నుంచీ కౌంటర్ ఎటాక్ గట్టిగానే నడుస్తోంది.

తాజాగా, ఈ విమర్శల పర్వంలోకి కొత్త పదం ‘ఆనిముత్తెం’ వచ్చి చేరింది. కొన్నాళ్ళ క్రితం టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, మహానాడు వేదికగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ‘నత్తి పకోడీ’ అంటూ విమర్శించిన విషయం విదితమే. ఆ ‘నత్తి పకోడీ’కి కాస్త పాలిష్డ్ వెర్షన్ అన్నమాట ఈ ‘ఆనిముత్తెం’.!

గోదావరి జిల్లాల్లో ఈ ‘ముత్తెం’ అన్న పదానికి వున్న ప్రత్యేకత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ముత్తెం.. ఆనిముత్తెం.. అని చాలా విరివిగా వాడేస్తుంటారక్కడ. ఉత్తరాంధ్రలో కూడా ‘వెటకారం’ కోణంలో ఈ ‘ఆనిముత్తెం’ అనే మాటని వినియోగిస్తుంటారు.

అధికారంలోకి వచ్చాక మద్య నిషేధం చేస్తామనీ, ఒక్క మద్యం షాపు కూడా రాష్ట్రంలో లేకుండా చేసిన తర్వాత మాత్రమే మళ్ళీ తమకు ఓట్లెయ్యాలని అడుగుతామనీ గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నినదించారు. ఇప్పుడేమో, మద్య నిషేధం గురించి తామెక్కడా మాట్లాడాలేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్లేటు ఫిరాయించారు.

దాంతో, వైసీపీ తీరుపై మండిపడుతూ ఓ వీడియో విడుదల చేసిన జనసేన, ‘ఆనిముత్తెం’ అని పేరు పెట్టింది.