దగాకోరు.. బటాచోరు.. రజాకారు పోషకుడవు.. దిగిపొమ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది దిగిపోవోయ్.. తెగిపోవోయ్.. నిరంకుశమే అంకుశమై నిజాము పాలన సాగుతున్న వేళ.. గర్జించింది తెలంగాణ గళం ఆవేశమే వర్షించింది దాశరథి కలం.. జనం హైలెస్సా.. నిజాముకు గుస్సా.. జైలుకు పంపితే ఊరూరా ఉర్రూతలూగించిన మనిషి ఊరుకుంటడా,. బొగ్గునే కలం చేసుకుని గోడలే బోర్డులుగా కోటలు కూలేలా కూతలు.. కపోతాల్లో సైతం ఆవేశం ఉప్పొంగేలా రాతలు!
రక్కసుడై నిజాము రక్తపాతం సృష్టిస్తుంటే నిస్సహాయంగా రోదిస్తున్న తెలంగాణ ప్రజల కంటినీరే సిరాగా ‘అగ్నిధార’ సృష్టించిన దాశరథి.. పెన్నే గన్నుగా యుద్ధాలు నడిపిన మహారది.. తెలంగాణ స్వేచ్ఛావారధి.. కవితా జలధి.. ఆంధ్రకవితా సారథి..!
ఆ చల్లని సముద్రగర్భం దాచిన బడబానలమెంతో.. గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో.. ఇలా అంటూనే రాసేసాడు కవితలెన్నో.. ప్రతి పోరడు..పౌరుడూ వీరుడయ్యేలా..!
నా తెలంగాణ కోటి రతనాల వీణ.. అప్పటికీ..ఇప్పటికీ..ఎప్పటికీ అదే ప్రేరణ.. తెలంగాణ స్ఫురణ.. ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని.. తీగలను దెంపి అగ్నిలోన దింపినావని దాశరథి పలికించిన రుద్రవీణ.. నిప్పు కణకణ..! డ్రాగన్నూ విడిచిపెట్టని దాశరథి కలం ఖబడ్దార్ చైనా అంటూ చేసింది హైరానా..!! తిమిరంతో సమరం చేసిన కలం ఉరకలెత్తిస్తే ధ్వజమెత్తిన ప్రజ.. అంతటి నిజామూ గజగజ!!!
కృష్ణమాచార్య కలంతో సినిమా సాహిత్యమూ సుసంపన్నమే.. ఖుషీఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ రాసేశాడు పాటలు.. హుషారు గొలిపే పూదోటలు.. ఈవేళ నాలో ఎందుకో ఆశలు.. అన్న ఆ కలమే.. కలయైనా నిజమైనా నిరాశలో ఒకటేలే.. అన్నది..ఆ నిరాశలోనూ ఆశను కన్నది..!
ఆవేశం రావాలి.. ఆవేదన కావాలి.. గుండెలోని గాయాలు మండించే గేయాలు..
నిన్న నాదే నేడు నాదే రేపు నాదేలే అన్న కవి.. తెలుగు సాహితీ వినీలాకాశంలో ఎప్పటికీ అస్తమించని రవి!