‘వై నాట్ 175’ అంటూ మాటలు చెబితే సరిపోదు. ‘సరిగ్గా పని చెయ్యకపోతే టిక్కెట్లు ఇవ్వడం కష్టమవుతుంది’ అనడమూ సత్ఫలితాలనివ్వదు. సంక్షేమ పథకాల నిమిత్తం బటన్లు నొక్కుతున్నానంటూ అస్సలు కుదరదు.! కింది స్థాయిలో ఏం జరుగుతోందో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలుసుకోవాలి. వైసీపీ వాస్తవ పరిస్థితేంటో అర్థం చేసుకోవాలి. విపక్షాల్ని నిర్వీర్యం చేసేశామని ఏ ముఖ్యమంత్రి లేదా ప్రధాని అనుకున్నా, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యిందనే చెప్పాలి. మూడు చోట్లా వైసీపీకి చుక్కలు చూపిస్తోంది టీడీపీ. ఓ చోట వైసీపీకి కాస్త బెటర్ పొజిషన్ కనిపిస్తోంది. అంతిమ ఫలితాలు వెల్లడి కావాల్సి వున్నా.. మూడిటికి మూడూ.. టీడీపీకి వెళ్తాయన్న ప్రచారమైతే జరుగుతోంది. మరోపక్క, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ సీట్లను గెలుచుకున్నామని వైసీపీ సంబరపడుతోంది. టీచర్ ఎమ్మెల్సీల విషయంలోనూ వైసీపీ అలాగే చెప్పుకుంటోంది. ‘ప్రజలు మా వెంట వున్నారు’ అని గెలిచిన స్థానాల గురించి వైసీపీ చెప్పుకుంటోందిగానీ.. ఓటమిని మాత్రం పట్టించుకోవడంలేదు.
నిజానికి, ఓటమే అత్యంత దారుణమైనది. గెలుపు మామూలుగా వచ్చేదే.! ఎందుకంటే, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రజా తీర్పుని ప్రతిబింబిస్తున్నాయి. స్థానిక సంస్థల కోటా వ్యవహారం వేరు. ఈ స్థాయి వ్యతిరేకత ఎందుకు గ్రాడ్యుయేట్లలో వచ్చిందన్నదానిపై పోస్టుమార్టమ్ చేసి తగు చర్యలు తీసుకోకపోతే, 2024 ఎన్నికలు వైసీపీకి దారుణమైన పాఠాన్ని నేర్పే అవకాశం లేకపోలేదు.