వైసీపీకి ఆంధ్రప్రదేశ్‌లో ప్రమాద ఘంటికలు.!

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రమాద ఘంటికలు మోగేశాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.! కింది స్థాయిలో డ్యామేజ్ చాలా చాలా ఎక్కువగా జరిగిపోతోంది.! కానీ, అధినాయకత్వం డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపట్టడంలేదు.

సంక్షేమ పథకాల విషయంలో ప్రజలకి పెద్దగా ఫిర్యాదులేమీ లేవు అధికార వైసీపీ మీద. కానీ, స్థానిక ప్రజా ప్రతినిథులపై తీవ్రస్థాయి వ్యతిరేకత ప్రజల్లో కనిపిస్తోంది. ‘ఈ ఎమ్మెల్యే మాకొద్దు..’ అని జనం మాత్రమే కాదు, వైసీపీలోనే కింది స్థాయి నేతలు, కార్యకర్తలు తెగేసి చెబుతున్నారు.

అయితే, అధినేత మెప్పు కోసం రాజకీయ ప్రత్యర్థులపై తిట్ల దండకం అందుకోవడమే సరైన మార్గంగా ప్రజా ప్రతినిథులు, ఇతర ముఖ్య నేతలు ప్రయత్నిస్తుండడం గమనార్హం.! రాజకీయ ప్రత్యర్థులపై బూతుల దండకం అందుకుంటున్న నేతల విషయంలో అధినాయకత్వం అప్రమత్తంగా వుండాల్సిందే. వారిని హెచ్చరిస్తూ వుండాల్సిందే. కానీ, అలాంటివేమీ జరగడంలేదు.

‘ముఖ్యమంత్రి బటన్ నొక్కుతున్నారు.. సమయానికి సంక్షేమ పథకాల పేరుతో జనానికి డబ్బులు నేరుగా అందుతున్నాయ్.. మేం మళ్ళీ గెలిచేస్తాం..’ అన్న భ్రమల్లో వుంటున్నారు మెజార్టీ వైసీపీ ప్రజా ప్రతినిథులు.

గడప గడపకీ మన ప్రభుత్వం కార్యక్రమం కావొచ్చు.. మరో కార్యక్రమం కావొచ్చు.. ఇవన్నీ నడుస్తున్నాయ్.. నడుస్తూనే వున్నాయ్. కానీ, ఇవేవీ ప్రజా ప్రతినిథులపై సాఫ్ట్ ఇమేజ్ ప్రజల్లో కల్గించలేకపోతున్నాయి. ప్రస్తుతానికైతే విపక్షంలో సరైన నాయకులు.. అంటే, అభ్యర్థులుగా పోటీ చేసేవాళ్ళు లేరన్నది వైసీపీ భావన.

ఈక్వేషన్స్ మారుతున్నాయ్.. వైసీపీని వీడుతున్న నేతల సంఖ్య పెరుగుతోంది.! అది వైసీపీని నిండా ముంచేయడానికి పెద్దగా సమయం పట్టదు.!