నిర్మలమ్మను టార్గెట్ చేసిన పురందేశ్వరి… మరిది కళ్లల్లో ఆనందంకోసం?

ఏపీ బీజేపీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించినప్పటినుంచీ ఏపీ ప్రభుత్వంపై పురందేశ్వరి తీవ్ర విమర్శలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రధానంగా ఏపీలోని అప్పులపై చంద్రబాబు చేసిన విమర్శలకు కొనసాగింపిస్తున్నారు! దీంతో వైసీపీ నేతలు.. మరిది కళ్లల్లో ఆనందం కోసం పురందేశ్వరి ప్రాకులాడుతున్నారు అని కామెంట్లు చేస్తున్నారు! ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి స్పందించారు పురందేశ్వరి.

అవును… ఏపీలో అప్పులపై కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో చేసిన ప్రకటనలపై తాజాగా పురందేశ్వరి స్పందించారు. ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వంతో పోలిస్తే జగన్ సర్కార్ చేసిన అప్పు కేవలం 1.77 లక్షల కోట్లు మాత్రమేనని ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా పార్లమెంటులో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో… ఇన్నాళ్లూ విపక్షాలు వైసీపీ సర్కార్ పై చేసిన విమర్శల్లో పస లేదని తేలిపోయింది.

అయితే నిర్మలమ్మ చేసిన ప్రకటనపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందించారు. రిజర్వుబ్యాంకుకు చూపించిన రూ.15 లక్షల కోట్ల ఆదాయం ఎలా వచ్చిందనే విషయంపై వైసీపీ సర్కార్ ప్రజలకు వివరణ ఇవ్వాలని దగ్గుబాటి పురందేశ్వరి ఇవాళ డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా… తాను ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడిన అంశానికి, పార్లమెంటులో సీతారామన్‌ గారు ఇచ్చిన సమాధానానికి మధ్య వ్యత్యాసం ఉందని పురందేశ్వరి పేర్కొనడం గమనార్హం.

చిన్న కాంట్రాక్టర్లకు ఉన్న రూ.71 కోట్ల బకాయిలు, ఉద్యోగులకు ఉన్న రూ.33 వేల కోట్ల బకాయిలు, వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి తీసుకున్న డిపాజిట్లు రూ.1170 కోట్లు, పబ్లిక్‌ ఖాతా ఫండ్‌ ల నుంచి తీసుకున్న రూ.26,235 కోట్లు, గ్రామ పంచాయతీల నుంచి దారి మళ్లించిన రూ.8,868 కోట్లు, జెన్‌కో – ట్రాన్స్‌ కోల నుంచి తీసుకున్న రూ.3600 కోట్లు జీపిఎఫ్‌ ఫండ్‌ నుంచి తీసుకున్న రూ.17 వేల కోట్లు… ఇలా అనధికారంగా తీసుకున్న రుణాలన్నీ కలిపితే మొత్తం 10.77 కోట్లు అప్పులున్నాయని చెప్పినట్లు తెలిపారు పురందేశ్వరి.

దీంతో… కేంద్ర ఆర్ధిక మంత్రి కంటే ఎక్కువ సమాచారం పురందేస్వరి వద్దే ఉన్నట్లుంది అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో మరిది కళ్లల్లో ఆనందం కోసం సొంత పార్టీ మంత్రిని సైతం ఇరకాటంలో పెట్టే పనికి సైతం పూనుకున్నారనే కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.

కాగా… రాష్ట్ర అప్పుల గురించి వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్‌ సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. పార్లమెంటులో స్పందించిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలమ్మ… 2019 నాటికి టీడీపీ రూ.2,64 లక్షల కోట్లు అప్పులు భారం రాష్ట్రంపై వేసిందని, ఈ భారం క్రమేణా పెరుగుతూ 2023 నాటికి రూ.4.41 లక్షలకు చేరిందని, నాలుగేళ్ల వైకాపా పాలనలో మరో రూ.1.77 లక్షల కోట్లు అప్పులు చేసిందని తెలిపారు.