పురందేశ్వరి, తనయుడు వైసిపిలోకి వస్తున్నట్లేనా?

కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురుందేశ్వరి రాజకీయాలు ప్రతిసారి వూహించని మలుపు తీసుకుంటూ ఉంటాయి. ఇంతవరకు ఆమె స్వయాన సరికొత్త రాజకీయ నిర్ణయాలు తీసుకుని  ఆందరిని ఆశ్చర్య పరుస్తూ వచ్చారు. ఇపుడు ఆమె కుమారుడు హితేష్ చెంచురాం గురించిన సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు.  హితేష్ చెంచురాం 2019 ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నాడు. అది కూడా వైసిపి నుంచి.  ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆ నియోజకవర్గాన్ని కైవసలం చేసుకోవాలనుకుంటున్నారు.  ఈ నియోజకవర్గానికి  పురందేశ్వరి భర్త దగ్గుబాటి వేంకటేశ్వరరావు ప్రాతినిధ్యం వహించారు. 1989లో ఆయన టిడిపి తరఫున గెలుపొందారు. తర్వాత  2004,2009లలో ఆయన కాంగ్రెస్ తరఫున గెలిచారు.  విభజనతో మనసు పాడయిన డాక్టర్ సాబ్ ఎన్నికల రాజకీయాలనుంచి తప్పుకున్నారు. దీనితో ఆ నియోజకవర్గం ఇపుడు తెలుగుదేశం ఆదీనంలో ఉంది.

రాజకీయాల్లో ఉంటూ ఒక నియోజకవర్గం లేని ప్రముఖ కుటుంబం దగ్గుబాటి పురందేశ్వరిదే.   ఇది  దగ్గుబాటి కుటుంబాన్ని పీడిస్తూ ఉంది. ఎందుకంటే, ఎన్టీఆర్ కుటుంబం నుంచి  రాజకీయాల్లో క్రియాశీలంగా అంటే లీడర్ లాగా కొనసాగుతున్నది ఆమెయే. బాలకృష్ణ పేరు కే టిడిపి ఎమ్మెల్యే (హిందూపూర్) గాని ఆయన పార్ట్ టైం పొలిటిషయనే.  హరికృష్ణ రాజకీయాల్లో లేనట్టే. జూనియర్ ఎన్టీయార్ ను టిడిపి పట్టించుకోవడం లేదు. ఇక మిగిలింది పురందేశ్వరే.

పేరున్న లీడరే గాని రాజకీయాలలో అడ్రసు అని చెప్పుకునే నియోజకవర్గమే లేదామెకు. నియోజవర్గం లేని వారికి సాధారంగా రాజ్యసభ అడ్రసవుతుంది. ఆమెకు ఈ అవకాశం కూడా రాలేదు.

ఆమె ఇపుడు పేరుకు బిజెపి సీనియర్ నాయకురాలు. అయితే, ఏంలాభం. అపుడొక ప్రకటన , ఇపుడొక ప్రకటన చేసి వార్తల్లో ఉండాల్సిందే తప్ప బిజెపి నుంచి ఆమెకు పెద్ద అండ ఉండేలా కనిపించడం లేదు. బిజెపి ఎవరెవరినొ రాజ్యసభకు నామినేట్ చేసింది గాని, ఆమెను  మాత్రం విస్మరించింది.

ఇక మిగిలింది 2019 ఎన్నికల్లో పోటీ చేయడమే. బిజెపి నుంచి పోటీ చేస్తే గెలుస్తారన్న గ్యారంటీ లేదు.ముఖ్యంగా ఆమెకొక నియోజకవర్గం అంటూ లేదు. పొత్తుంటేనే రాష్ట్రంలో బిజెపి గెలుస్తుంది. టిడిపితో పొత్తు తెగిపోయింది. వైసిపితో డైరెక్టు పొత్తు ఉంటుందన్న గ్యారంటీ లేదు.దీనితో  బిజెపి నుంచి ఆమెకు పార్లమెంటులో ప్రవేశించే  అవకాశాలు బాగా తక్కువగా కనబడుతున్నాయి. తన పరిస్థితే అంతంత  మాత్రంగా ఉన్నపుడు కుమారుడు హితేష్ ను కూడా బిజెపి నుంచి పోటీ చేయించడం సాహసం అవుతుంది. ఎందుకంటే   మొదటి ప్రయత్నం లోనే ఎదురు దెబ్బ తగలరాదు. అందువల్ల హితేష్ కు తగ్గ పార్టీ వైఎస్ ఆర్ కాంగ్రెసేనని ఆమె కుటుంబం భావిస్తున్నట్లు సమాచారం.

వైఎస్ ఆర్  కాంగ్రెస్ పార్టీ యువతరం పార్టీ. నాయకత్వం యువనాయకుడయిన జగన్ ది. ఆయన ప్రోత్స  హిస్తున్నది కూడా యువకులనే. అక్షరాాల అది యూత్ ఫుల్ పార్టీ. బిజెపి లో వృద్ధతరమే ఎక్కువ. కాబట్టి ఏ విధంగా చూసినా హితేష్ కు వైసిపియే అనువైన పార్టీ అనిదగ్గుబాటి దంపతులు  భావిస్తున్నారని తెలిసింది. దానికి తోడు పురందేశ్వరికి జగన్ మీద చాలా గౌరవం. మరొక విషయం,  వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా పురందేశ్వరిని చాలా గౌరవంతో చూసేవారు. ఇలాంటి సత్సంబంధాలనడుమ హితేష్ ను వైసిపి నుంచిపోటీ చేయిస్తే పర్చూరు నియోజకవర్గాన్ని కుటుంబం కంట్రోల్ లోకి తీసుకోవచ్చని ఫా మిలీ లో ఆలోచన వుందని  దగ్గుబాటి కుటుంబం గురించి తెలిసిన వర్గాలు తెలిపాయి.

అయితే, హితేష్ ని మాత్రమే వైసిపిలోకిపంపాలా లేక తాను కూడా వెళ్లాలనేది ఇపుడు  ఆమెకు ఎదురయిన సమస్య. 2019లో ఆమె కూడా ఆమె పోటీచేయాలనుకుంటున్నారు. గత పార్లమెంటుకు ఎక్కడో రాజంపేట నుంచి పోటీ చేసి వోడిపోయారు. అంతకు ముందు ఆమె ఒక సారి బాపట్లనుంచి మరొకపారి విశాఖ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు. రాజకీయాలలో ప్రముఖుల కుటుంబాలకు సాధ్యమయినంతవరకు ఒక సొంత నియోజకవర్గం ఉంటుంది.  ఎన్టీయార్ వారసురాలేన తనకి ఒక నియోజకవర్గం లేకుండా పోయింది. భర్త ప్రాతినిధ్యం వహించిన పర్చూరు చేజారిపోయింది.

అందుకని ఆమె విజయవాడ నియోజకవర్గం నుంచి పోటీచేసి దానిని తన రాజకీయ కేంద్రం చేసుకోవాలనుకుంటున్నారు. ఇపుడు తనకు విజయవాడ, కుమారుడికి పర్చూరు నియోజకవర్గం కోరుతూ జగన్ తో చర్చలు సాగిస్తునట్లు చెబుతున్నారు. తన విజయవాడ నిర్ణయం తేలినా తేలకపోయినా  హితేష్  విషయంలో  మాత్రం వైసిపినుంచి పోటీ చేయించాలని  ఆమె తీర్మానించుకున్నట్లు, దీనికి వైసిపి నుంచి పాజిటివ్ సంకేతాలు వచ్చినట్లు తెలిసిన వాళ్లు చెబుతున్నారు.

2014 లో ఇక్కడి నుంచి వైసిపి అభ్యర్థిగా గొట్టి పాటి భరత్ కుమార్ పోటీ చేశారు. అయితే, ఆయన  టిడిపి అభ్యర్థి ఏలూరి సాంబశివరావుచేతిలో ఓడిపోయారు. 2019 లో ఆయన పోటీ చేసేందుకు సుముఖంగా లేరనే వార్తలు వస్తున్నాయి.  ఇది హితేష్ కు అనుకూలమయిన పాయింట్.అయితే, భరత్ పోటీ చేసేందుకు సిద్ధమయితే, హితేష్ మరొక నియోజవర్గం  చూసుకోవలసి వస్తుంది.  పర్చూరును దగ్గుపాటి కుటుం సొంత నియోజకవర్గం చేసుకోవాలన్న సెంటిమెంట్  అమలు కావడం కష్టం. ఏమవుతుందో చూద్దాం…