చంద్రబాబు, లగడపాటి, మీడియా అధినేత రహస్య సమావేశం

మరో మోసానికి లగడపాటి రాజగోపాల్ సిద్ధమవుతున్నారా ? క్షేత్రస్దాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను అవే అనుమానాలు మొదలయ్యాయి. చంద్రబాబునాయుడు నివాసంలో మాజీ ఎంపి, ఎన్నికల సర్వేలు చేయటంలో మొన్నటి వరకూ మంచి క్రెడిబులిటీ ఉన్న లగడపాటి రాజగోపాల్, చంద్రబాబుకు మద్దతిచ్చే మీడియా అధిపతి రహస్య సమావేశం జరిగింది. ముగ్గురి మధ్య దాదాపు గంటకుపైగా కీలక సమావేశం జరిగింది. షెడ్యూల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో వీరి ముగ్గురి మధ్య సమావేశం జరగటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎందుకంటే, నిజానికి చంద్రబాబుతో పై ఇద్దరు సమావేశం అవ్వాల్సిన అవసరం లేదు.

లగడపాటి, మీడియా అధిపతి తో చంద్రబాబు సమేవేశం అయ్యారంటేనే రాబోయే ఎన్నికలకు సంబంధించే అన్నది స్పష్టమవుతోంది. మొన్నటి తెలంగాణా ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతుగా లగడపాటి, మీడియా అధిపతి మహాకూటమి అభ్యర్ధులను గెలిపించాలని నానా అవస్తలు పడ్డారు. కాకపోతే జనాలు మూతి పగలగొట్టారు. దాంతో ముగ్గురి తల బొప్పి కొట్టింది. ఇక ఏపి విషయానికి వస్తే ఇప్పటి వరకు సర్వేలు నిర్వహించిన ప్రతీ జాతీయ మీడియా కూడా రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో వైసిపిదే పై చేయిగా చెప్పాయి. ఏ సర్వేలో కూడా చంద్రబాబుకు గౌరవప్రదమైన సీట్లు వస్తాయని రాలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకునే లగడపాటితో సర్వేలు చేయించాలని, సదరు మీడియాలో దాన్ని ప్రముఖంగా ప్రచురించటం ద్వారా జనాలను మోసం చేయాలని బహుశా నిర్ణయం జరిగుండచ్చని జగన్మోహన్ రెడ్డి మీడియా చెబుతోంది.

తన సర్వేలతో తెలంగాణా ప్రజానీకాన్ని లగడపాటి ఎలా మోసం చేసింది అందరూ చూసిందే. తెలంగాణా ఎన్నికల సర్వే ముందు వరకూ లగడపాటి సర్వేలపై జనాల్లో విశ్వసనీయత ఉండేది. ఎప్పుడైతే తన సర్వేతో లగడపాటి చంద్రబాబును గెలిపించాలని ప్రయత్నించినట్లు బయటపడిందో తన క్రెడిబులిటీబ మొత్తాన్ని లగడపాటి పోగొట్టుకున్నారు. దాంతో అప్పటి నుండి తెలంగాణా సర్వే ఫలితాలపై లగడపాటి ఎక్కడా నోరు కూడా విప్పలేదు. ఉభయ రాష్ట్రాల్లో లగడపాటిని సర్వే విషయంలో అమ్మనాబూతులు తిట్టని వారు లేరు. అయినా లగడపాటి ఎందుకు నోరిప్పలేదు ? ఎందుకేంట, తనకు తెలుసు చంద్రబాబు కోసం తన క్రెడిబులిటీని పణంగా పెట్టారని.

అలాంటిది తాజాగా చంద్రబాబు లగడపాటి, మీడియా అధినేత సమావేశం అయ్యారంటే మళ్ళీ సర్వేలు, ప్రత్యర్ధులను డబ్బులతో లోబరుచుకోవటం లాంటి వాటికి తొందరలో తెర లేవనున్నట్లు అనుమానం వస్తోంది. నాలుగున్నరేళ్ళ ప్రజా వ్యతిరేక పాలనతో జనాలు చంద్రబాబుపై బాగా మంటగా ఉన్నారు. ఆ విషయం చంద్రబాబుకు కూడా బాగా అర్ధమైంది. జనాల్లోని వ్యతిరేకతను తట్టుకోవాలంటే ఎలాగన్న విషయమీదే ముగ్గురు సమావేశమై చర్చించుకున్నట్లు అర్ధమైపోతోంది. మరి చూడాలి రేపో మాపో అసలు విషయం బయటకు వస్తుంది కదా ?