వైసీపీ నేతలపై క్రిమినల్ కేసులు.. ఆ ఇద్దరినీ లోకేశ్ టార్గెట్ చేశారా?

తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉండాల్సిన నారా లోకేశ్ చిన్నచిన్న తప్పుల వల్ల తరచూ విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమిపాలైన నారా లోకేశ్ 2024 ఎన్నికల్లో కూడా అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఎవరు ఏమనుకున్నా కొన్ని విషయాలకు సంబంధించి లోకేశ్ తనదైన దారిలో ముందుకు వెళుతుండటం గమనార్హం.

పొలిటికల్ గా సక్సెస్ కావడానికి ఉన్న ఏ అవకాశాన్ని లోకేశ్ వదులుకోవడం లేదు. అదే సమయంలో తనపై కావాలని ట్రోల్స్ చేసినా తనను టార్గెట్ చేసినా లోకేశ్ ధీటుగా బదులిస్తున్నారు. అయితే సీనియర్ ఎన్టీఆర్ కూతురు ఉమా మహేశ్వరి మృతి చెందిన సమయంలో లోకేశ్ పై ఆరోపణలు వినిపించాయి. ఆస్తి కోసం లోకేశ్ వేధించడం వల్లే ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారని ప్రచారం జరిగింది.

అయితే ఈ విధంగా ప్రచారం చేసిన వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గుర్రంపాటి దేవదర్ రెడ్డి, ఎమ్మెల్సీ పోతుల సునీతలపై లోకేశ్ క్రిమినల్ కేసులు నమోదు చేశారని సమాచారం అందుతోంది. మంగళగిరి మెజిస్ట్రేట్ కోర్టులో లోకేశ్ కేసులు వేసినట్లు లోకేశ్ తరపు లాయర్ల నుంచి సమాచారం అందుతోంది. పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా పోస్టులు పెట్టడంతో ఫిర్యాదు నమోదు చేసినట్టు లోకేశ్ పిటిషన్ లో పేర్కొన్నారు.

ఈ కేసు గురించి వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఈ విధంగా లోకేశ్, చంద్రబాబులపై మేము కూడా కేసులు నమోదు చేసి ఉంటే ఈ పాటికి చంద్రబాబు, లోకేశ్ జైలులో ఉండేవారని కొంతమంది వైసీపీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు విషయంలో కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.