సొమ్మొకడిది సోకొకడిది అన్న సామెత చాలా పాపులర్ తెలుగులో. రాష్ట్రప్రభుత్వ పరిస్ధితి అదే విధంగా ఉంది. రాజధాని ప్రాంతం అమరావతిలో మౌళికసదుపాయాల కల్పనకు అవసరమైన డబ్బుల కోసం రైతుల నుండి సేకరించిన భూములను తాకట్టు పెట్టేందుకు రాజధాని ప్రాంత ప్రాధికార సంస్ధ (సిఆర్డిఏ) రంగం సిద్ధం చేసుకుంటోంది. మౌళికసదుపాయల కల్పనకు సుమారు రూ. 10 వేల కోట్లు ఖర్చవుతాయని సిఆర్డిఏ అంచనా వేసింది. అందుకు సిఆర్డిఏ ఖాతాలో ఎటూ డబ్బు లేదు. అప్పిచ్చే సంస్ధలు కూడా కనబడటం లేదు. దాంతో అప్పులు చేయటమే మార్గంగా సిఆర్డిఏ నిర్ణయించుకుంది.
అందుకని రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం రైతుల నుండి సమీకరించిన వేలాది ఎకరాలను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి అప్పులు చేయాలని నిర్ణయించింది. సమీకరించిన వేలాది ఎకరాలు ప్రస్తుతం సిఆర్డిఏ ఆధ్వర్యంలోనే ఉన్నాయి. అందుకనే తన వద్దున్న వేలాది ఎకరాలను బ్యాంకుల్లో తాకట్టుపెట్టి రూ. 10 వేల కోట్లు అప్పు చేయటానికి అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వానికి సిఆర్డిఏ లేఖ రాసింది.
మొన్ననే రాజధాని నిర్మాణం పేరుతో బాండ్లు జారీ చేసి రూ. 2 వేల కోట్లు అప్పు చేసిన సంగతి తెలిసిందే. సిఆర్డీఏ రేటింగ్ సరిగా లేనందు వల్ల అప్పులు ఇవ్వటానికి కూడా ఎవరు ముందుకు రావటం లేదు. దాంతో అప్పులు దొరకటం కూడా కష్టంగా తయారైంది. ఒకవేళ అప్పులు కావాలన్నా సవాలక్ష కండీషన్లు పెడుతున్నారు. అవన్నీ ఫుల్ ఫిల్ చేయటం సాద్యం కాదు. ఒకవైపేమో ఎన్నికలు ముంచుకు వస్తున్నాయి. అందుకనే తన దగ్గరే ఉన్న భూములను కుదవపెట్టేసి అప్పులు చేసేయొచ్చని సిఆర్డీఏ ప్లాన్ వేసింది. అంటే ముందు ముందు రైతుల నుండి సమీకరించిన వేలాది ఎకరాలను తాకట్టు పెట్టేయటం ఖాయంగా కనిపిస్తోంది.