సీపీఎస్ రద్దు.! తర్వాతేంటి జగన్.?

ఎట్టకేలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో ఎన్నికల హామీని నిలబెట్టుకున్నారు.!? అంతేనా.? నిలబెట్టుకున్నట్టేనా.? సీపీఎస్ రద్దు చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది గనుక, ఎన్నికల హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నట్టే భావించాలేమో.!

2019 ఎన్నికల ప్రచారంలో, ‘అధికారంలోకి వస్తూనే, వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తాం..’ అని ప్రకటించేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. నాలుగేళ్ళు పట్టింది సీపీఎస్ రద్దు చేయడానికి. ఉద్యోగ సంఘాలు ఎన్నిసార్లు ఈ విషయమై ఉద్యమాలు చేసినా, వైసీపీ సర్కారు పట్టించుకోలేదు.

‘సీపీఎస్ రద్దు విషయమై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవగాహన లేకుండా ఎన్నికల హామీ ఇచ్చారు. సీపీఎస్ రద్దు చేయలేం..’ అంటూ కొన్నాళ్ళ క్రితం వైసీపీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు, ఉద్యోగుల ఆందోళనను మరింత పెంచేదిగా చేసింది.

ఏమయ్యిందోగానీ, సీపీఎస్ రద్దు దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. దాంతో, ‘మేం ఎన్నికల హామీని నిలబెట్టుకున్నాం’ అని చెప్పడానికి వైసీపీకి ఓ అవకాశం దొరికినట్లయ్యింది.

అయితే, ఉద్యోగులు మాత్రం, ‘సీపీఎస్ రద్దు కాలేదు.. ఆ స్థానంలో జీపీఎస్ తీసుకొస్తున్నారంతే.. మా నినాదం, సీపీఎస్ పూర్తిగా రద్దు చేసి, పాత విధానానికి వెళ్ళాలి..8 అని నినిస్తున్నారు. అంటే, మళ్ళీ మరో సంకటం అన్నమాట.

ఈ పంచాయితీ ఎక్కడ తెగుతుందో ఏమో మరి.!