మోడీ సర్కారు తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ.. ఈ రోజు భారత్ బంద్ కు పిలుపునివ్వటం.. పెద్ద ఎత్తున రాష్ట్రాలు మద్దతు ఇవ్వటం తెలిసిందే. అంచనాలకు మించి బంద్ సక్సెస్ అవుతున్న వేళ.. ఏపీ కమ్యునిస్టు నేతలు పవన్ ను టార్గెట్ చేశారు. జనసేనాని పవన్ కళ్యాణ్ రైతుల పక్షాన నిలవాలని పేర్కొన్నారు.
నివర్ తుపాను కారణంగా జరిగిన పంట నష్టంపై ఏ రీతిలో అయితే దీక్ష చేస్తున్నారో.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గళం విప్పాలన్నారు. అప్పుడు మాత్రమే పవన్ ను ప్రజలు నమ్ముతారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఇక.. ఇదే అంశంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు కూడా పవన్ కు సలహా ఇచ్చే ప్రయత్నం చేశారు. రైతుల పక్షాన నిలవాలని.. వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకించాలన్నారు.
ఒక దేశం.. ఒక పన్ను అంటూ జీఎస్టీ తీసుకొచ్చి ఇబ్బందులకు గురి చేశారని.. ఇప్పుడు ఒక దేశం ఒక మార్కెట్ అన్న నినాదం తీసుకురావటాన్ని ఆయన తప్పు పట్టారు. కేంద్రంలోని మోడీ సర్కారుకు మిత్రపక్షంగా ఉన్న జనసేన పవన్ కళ్యాణ్.. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా స్పందించే అవకాశం లేదు. ఈ కారణంతోనే భారత్ బంద్ విషయంలోనూ పవన్ మౌనంగా ఉన్నారు. ఆయన్ను ఇరుకున పెట్టేందుకు వీలుగా వామపక్ష నేతలు.. సలహా రూపంలో పవన్ కు పంచ్ ఇచ్చారని చెప్పక తప్పదు.