అయిదేళ్లకొకసారి ఎన్నికలు పెట్టేదానికంటే ఏడాదికోసరి ఎన్నికలు నిర్వహిస్తే ఆంధ్రప్రదేశ్ లో పేద ప్రజలు బాగుపడ్తారని సిపిఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి కె రామృష్ణ అన్నారు.
రాష్ట్రంలో గర్జనలు, సభలు, యాత్రలు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నాయకుడు జగన్మహన్ రెడ్డి వోట్ల కోసం వరాల వాన కురిపిస్తున్నారని చెబుతూ ఇలాంటి నాయకులున్నపుడు అయిదేళ్లకొకసారి కాకుండా ఏడాదికొకసారి ఎన్నికలు జరిపితే పేదలందరికి చాలా డబ్బు అందుతుందని ఆయన అన్నారు. రామకృష్ణ ఈ రోజు విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ బాబు, జగన్ లు ఓట్ల కోసం చేస్తున్న హామీలను,నగదు బదిలీ పథకాలను ప్రస్తావిస్తూ ఈ ధోరణిని విమర్శించారు.
ఇదే విధంగా ప్రధాని నరేంద్రమోదీ హామీల గురించి ప్రస్తావిస్తూ నాలుగేళ్ల పాటు కార్పొరేట్ లకు ఊడిగం చేసి ఎన్నికలు సమీపిస్తుండగా రైతుల పై ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. రైతులకు 6 వేల రూపాయాలు పెట్టుబడి మూడు దఫాలుగా ఇస్తామంటున్నారు, ప్రధాని మోడీ ఎన్నికల్లో ఓట్లు పొందడమే ధ్యేయం పని చేస్తున్నారని ఆయన అన్నారు. మోదీ చంద్రబాబు ఇద్దరు రైతుల విషయంలో కెసియార్ ను కాపి కొడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పసుపు కంకుమ పేరుతో ఇస్తున్న రు. 10 వేలను ఒకేసారి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
బిసి లకు ఓట్లున్న విషయం చంద్రబాబు, జగన్ లకు ఎన్నికల సమయంలోనే గుర్తొస్తున్నాయని, గర్జన ,జయహో బిసి సభలు నిర్వహించి బిసి వోట్లు కాజేయాలని చూస్తున్నారని అన్నారు.
ఇరుపార్టీ లు ఒక్క బిసి కైనా రాజ్యసభ సీటు ఇచ్చారా? వాళ్లెవరికి ఇచ్చారో చూస్తే వాళ్ల బిసి ప్రేమ కపట ప్రేమ అని అర్థమవుతుందని రామకృష్ణ అన్నారు.
జగన్ రాజ్యసభ సీటు ఇచ్చింది ఏ కులానికి?
వైకాపా 13 జిల్లాల సమన్వయ కర్తల పదవులను ఇచ్చింది ఏ కులానికి?
వీటికి వైకాపా లోని ధర్మాన,పార్థసారథి,బొత్స ల వంటి బిసిలు పనికి రారా?
చంద్రబాబు ,జగన్ లకు బిసి ల గురించి మాట్లాడే నైతిక హక్కులేదని అంటూ పొరపాటున అధికారంలోకి వస్తే జిల్లాల వారీగా రాష్ట్రాన్న పంచుకుని తినేస్తారని ఆయన విమర్శించారు.
చంద్రబాబు, జగన్ ఫిరాయింపుదారులను ప్రోత్సహిస్తున్నారుని చెబుతూ కనీసం పార్టీ మారే వాళ్ళకైనా బుద్ధి ఉండాలని తీవ్రంగా విమర్శించారు.
సామాజిక న్యాయం జరగాలంటే ,చంద్రబాబు, జగన్ లు ఇద్దరు దిగిపోవాలని రామకృష్ణ అన్నారు.