ఓపెన్ అయిపోయిన బాబు… వారికి థాంక్స్ అంట!

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో అధికారిక పొత్తులు – అనధికారిక పొత్తులతో.. ఫుల్ కన్ఫ్యూజన్ పాలిటిక్స్ నడుస్తున్నట్లు అనిపిస్తున్నా… అబ్బే అలాంటి అనుమానాలేమీ పెట్టుకోవద్దు అని అంటున్నారు చంద్రబాబు! కన్ఫ్యూజన్ ఏమీ లేదు.. అంతా ఒక్కటే అని స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఏ రాజకీయం చేసినా, ఎలాంటి పొత్తు పెట్టుకున్నా, ఆఖరికి అభ్యర్థులను ప్రకటించే విషయంలోనూ తాను చేయాల్సిన పోరాటం అంతా చేసి, చివర్లో బహిరంగంగా ప్రకటించేవారు చంద్రబాబు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లోనో.. ఆయనకున్న వ్యక్తిగత టెన్షన్స్ తోనో… అన్నీ బహిరంగంగా ప్రకటించేస్తున్నారు చంద్రబాబు. అందులో భాగంగా… సీపీఎం, సీపీఐ, జ‌న‌సేన పార్టీలకు థాంక్స్ చెబుతున్నారు బాబు!

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన ఊపులో ఉన్నారు. ఆ ఉత్సాహం ఆయన ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. దీంతో చాలా కాలం తర్వాత గెలుపు ఫలితాలు చూసిన చంద్రబాబు… ఇక వైసీపీ ప‌ని అయిపోయిందనే నమ్మకమైన భ్రమలోనో – భ్రమతో కూడిన నమ్మకంతోనో ఉన్నారు. ఈ సందర్భంగా త‌మ విజ‌యానికి స‌హ‌క‌రించార‌నే ఉద్దేశంతో సీపీఎం, సీపీఐ, జ‌న‌సేన పార్టీ ర‌థ‌సార‌థుల‌కు బాబు కృతజ్ఞతలు చెప్పారు.

ఈ ఎన్నికల్లో అధికారికంగా వామ‌ప‌క్షాలు – టీడీపీ మ‌ధ్య ఓ అవ‌గాహ‌న కుదిరింది. మొద‌టి, రెండో ప్రాధాన్యత ఓటును పరస్పరం వేసుకోవాల‌ని ఇరువర్గాల నాయకులూ పిలుపు ఇచ్చారు. ఆ ప్రకారం ఓట్ల బ‌దిలీ జ‌రిగింది. కానీ… జ‌నసేనాని ప‌వ‌న్‌ క‌ల్యాణ్ విష‌యానికి వ‌స్తే… తాను అధికారికంగా పొత్తులో ఉన్న బీజేపీకి ఓటు వేయమని ఆయన చెప్పలేదు. కానీ… వైఎస్ జ‌గ‌న్ పార్టీని ఓడించాల‌ని మాత్రం అధికారికంగా పిలుపునిచ్చారు. అంటే… టీడీపీ, వామ‌ప‌క్ష పార్టీల‌కు ఓట్లు వేయాల‌ని డైరెక్టుగా పిలుపునిస్తే… మిత్రపక్షమైన బీజేపీకి కోపం వ‌స్తుంద‌ని ఆయ‌న ఇలా వ్యూహాత్మకంగా వ్యవహరించారన్నమాట! అనుకున్నట్లుగానే అంతా కలిసి ఆ ఎన్నికలను అలా ముగించారు.

అయితే… ఈ విషయంలో బీజేపీ నేతలు మాత్రం కాస్త ఫీలవుతున్నారని తెలుస్తుంది. ఎందుకంటే… తమ పార్టీ నుంచి రెండో ప్రాధాన్యత ఓట్లు టీడీపీ అభ్యర్థులకు వేయించింది బీజేపీ! దీంతో… ఇలాంటి సహాయం చేసినా కూడా త‌మకు క‌నీసం కృతజ్ఞతలు చెప్పకపోవడంపై బీజేపీ నేత‌లు హ‌ర్ట్ అవుతున్నారంట. మూడు గ్రాడ్యుయేట్స్ స్థానాల్లో త‌మ పార్టీ అభిమానులంతా అత్యధికంగా టీడీపీకి మద్దతు ప‌లికిన విషయాన్ని బాబు మ‌రిచిపోవ‌డం ఏంట‌ని బీజేపీ నేత‌లు మండిప‌డుతున్నారట!

మరి ఈ ఏపీ బీజేపీ నేతల బాధను, ఆవేదననూ బాబు ఇప్పటికైనా అర్ధం చేసుకుంటారా? వారికి కూడా ఒక థాంక్స్ చెబుతారా? లేక.. కేంద్రంలోని బీజేపీతో టీడీపీని కలిపేవరకూ, మోడీతో బాబుకి అపాయింట్ మెంట్ ఇప్పించేవరకూ ఇలానే ర్యాగింగ్ చేస్తారా అన్నది వేచి చూడాలి!