పొత్తులపై సీపీఐ రామకృష్ణ మనసులో మాట ఇది!

ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగానే ఏపీలో రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. పైగా తాజాగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు కూడా వెలువడడంతో.. ఏపీలో కూడా ఎన్నికల వాతావరణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి నడుస్తాయనే సంకేతాలు ఇస్తున్నారు పవన్. అయితే… ఈ విషయాలపై తాజాగా స్పందించారు సీపీఐ రామకృష్ణ.

పేరుకే ఎర్ర పార్టీలో ఉంటారు కానీ… పసుపు రంగు పూసుకోవడానికి నిత్య ప్రాకులాడే నేతగా పేరున్న రామకృష్ణ… పొత్తులపై స్పందించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, సీపీఐ లు కలిసి పోటీచేస్తాయని చెప్పుకొచ్చారు. ఒకపక్క చంద్రబాబేమో… మోడీతో కలిసి నడిస్తేనే బెటరని ఆలోచిస్తుంటే… మరో వైపు పవన్ ఏమో… మోడీ-బాబులతో కలిసి తాను నడిస్తేనే బెటరని ఆలోచిస్తుంటే… రామకృష్ణ ఏమో తన మనసులో మాట ఇలా బయటపెట్టారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ ప్రభుత్వాలు సక్రమంగా పనిచేయడం లేదని, కక్ష పూరిత చర్యలకు పాల్పడుతున్నాయని రామకృష్ణ విమర్శించారు. ఇదే సమయంలో చంద్రబాబు నివసిస్తున్న లింగమనేని గెస్ట్ హౌస్ ను ఎటాచ్ చేసేందుకు సీఐడీకి అనుమతివ్వడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. బాబుకు ఎప్పుడు ఏ కష్టమొచ్చినా.. మైకుల ముందుకు వచ్చేందుకు ఉత్సాహ చూపించే రామకృష్ణ.. రాబోయే ఎన్నికల్లో ఆయనతోనే కలిసి వెళ్లాలని బలంగా నిర్ణయించుకున్నారు.

మరి రామకృష్ణ తెరపైకి తెచ్చిన ఈ పొత్తుల ప్రతిపాదనకు చంద్రబాబు, పవన్ లు ఎలా రియాక్ట్ అవుతారు అనేది వేచి చూడాలి. పైగా కర్ణాటకలో బీజేపీ బొక్కబోర్లా పడ్డది కనుక… పవన్ – చంద్రబాబులు పునరాలోచనలో పడితే… ఆ గ్యాప్ ని తాను ఫిల్ చేద్దామని రామకృష్ణ ముందస్తు చర్యలకు దిగారా అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా… ప్రజాసమస్యల సంగతి తర్వాత అంటు పొత్తులపైనా, రాజకీయ అంశాలపైనా మాట్లాడటానికి మాత్రమే కమ్యునిస్టులు పరిమితం అవ్వడం వారి దయణీయస్థితికి అద్దం పడుతుందని అంటున్నారు కమ్యునిస్టు పార్టీల అభిమానులు!