నరేంద్ర మోదీ రాజకీయ ప్రస్థానంలో చోటు చేసుకున్న పరిణామాల్లో గోద్రా అలర్ల ఘటన అతి ప్రధానమైనది. 2002లో జరిగిన ఆ అల్లర్లలో సుమారు 2000 మంది వరకు మరణించారు. అల్లర్ల సమయానికి గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్నారు. దీంతో ప్రత్యర్థి పార్టీలన్నీ అల్లర్లకు కారణం మోదీ నేనని ఆరోపించాయి. రాజకీయ ప్రయోజనాల కోసమే మోదీ అల్లర్లు సృష్టించారని విమర్శించారు. ఆ అల్లర్లను మోదీ రాజకీయ జీవితంపై ఒక మచ్చలా స్థిరపడేలా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. మరణించిన వారిలో మైనారిటీలు ఎక్కువగా ఉండటంతో ప్రత్యర్థుల ఆరోపణలకు మరింత బలం చేకూరింది. అల్లర్లకు మోదీ నే బాధ్యుడని దిగువ కోర్టుల్లో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి.
2004లో బ్రిటన్ కు చెందిన ఒక కుటుంబం అల్లర్లలో హత్య గావించబడి మరణించిన ముగ్గురు ముస్లిం వ్యక్తుల తరపున కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. తమ కుటుంబ సభ్యుల మరణానికి నాటి సీఎం నరేంద్ర మోదీ యే కారణమని, ఆయన నుంచి రూ. 24 కోట్ల రూపాయలు నష్ట పరిహారం డిమాండ్ చేశారు పిటిషన్ దారులు. ఈ కేసులో చాలా కాలంపాటు విచారణ జరగ్గా చివరికి అల్లర్లకు మోదీయే కారణమని నిరూపించే ఆధారాలేవీ లేనందున పిటిషన్ నుండి ఆయన పేరును తొలగిస్తున్నట్టు తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో మోదీ మీద పడిన గోద్రా అల్లర్ల మరక కొంతైనా తగ్గినట్టే.
ఈ అల్లర్ల వివాదంలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మోదీ మీద తీవ్ర ఆరోపణలు రావడంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం నిజానిజాలు తేల్చాలని నానావతి కమీషన్ ను నియమించింది. సుధీర్ఘ కాలం పాటు వందల మందిని విచారణ చేసిన కమీషన్ అల్లర్లలో మోదీ ప్రమేయం లేదని, కేవలం అల్లర్లను అదుపుచేయలేని పోలీసుల వైఫల్యం వల్లనే అల్లరి మూకలు చెలరేగి అంత ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లిందని గతంలోనే పెర్కొంటూ మోదీ కి క్లీన్ చీట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజా కోర్టు తీర్పు మోదీ ని విమర్శించే వారికి చెంపపెట్టులాంటిదని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.