ఖరీదైన సలహా.! వైసీపీకి అదే పెద్ద శాపం కాబోతోందా.?

సలహాదారుల విషయమై పెద్ద రచ్చే జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 30 మందికి పైగా సలహాదారులున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో. అంతకు ముందు చంద్రబాబు హయాంలోనూ సలహాదారులు వున్నాగానీ, ఆ సంఖ్య చాలా తక్కువ. ఆ సలహాదారులు కూడా ఖర్చు దండగ వ్యవహారమే. ఆ బోడి సలహాలు రాష్ట్రానికీ ఉపయోగపడలేదు, తెలుగుదేశం పార్టీకీ ఉపయోగపడలేదు. ఇప్పుడూ అంతే. ప్రభుత్వ ఖజానా నుంచి సలహాదారులకు చెల్లింపులు జరుగుతున్నాయి. అంటే, రాష్ట్ర ప్రజల మీద ఆ ‘సలహా భారం’ చాలా ఎక్కువవుతోందన్నమాట. సలహాదారుల కోసం చేసే ఖర్చుని వాలంటీర్ల గౌరవ వేతనాలు పెంచడానికి ఉపయోగించినా.. అది రాష్ట్ర ప్రజలకీ, వైసీపీకీ మేలు జరుగుతుంది.

సరికొత్త పేర్లతో సలహాదార్లను కొత్త కొత్తగా తెరపైకి తెస్తోంది వైసీపీ సర్కారు. ఈ సలహాదారుల్ని వైసీపీలోనే చాలామంది నేతలూ తప్పు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ, పైకి గట్టిగా ఎవరూ చెప్పలేరు. ‘మేం లేమా.? మమ్మల్ని అడిగితే సలహాలు ఇవ్వమా.? వాళ్ళనెందుకు సలహాదారులుగా నియమించడం ఖర్చు దండగ కాకపోతే.?’ అంటూ వైసీపీ నేతలే ఆఫ్ ది రికార్డుగా మాట్లాడుకుంటున్నారు. అధికారులైతే, ఈ సలహాదారులు చేసే పనేంటో.. వాళ్ళ వల్ల రాష్ట్రానికి ఉపయోగమేంటో అర్థం కాక తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి. కొందరు మంత్రులకు సైతం, సలహాదారుల కారణంగా తలనొప్పి వచ్చి పడుతోంది. సలహాదారులతో ఆధిపత్య పోరు నడపాల్సిన దుస్థితి కొందరు మంత్రులకు ఎదురవుతోందట.

ఇంత వ్యతిరేకత సలహాదారులపై వున్నా, సరికొత్తగా సలహాదారులు ఎందుకు పుట్టుకొస్తున్నారు.? వారి వల్ల పార్టీకైనా, ప్రభుత్వానికైనా ఎంత ఉపయోగం.? అన్నదానిపై ముఖ్యమంత్రి ఆత్మవిమర్శ చేసుకోకపోతే ఎలా.? సలహా అంటే అదొక దోపిడీ.. అనే భావన పెరిగిపోతోంది. వున్నపళంగా సలహాదారుల విషయమై కీలక నిర్ణయం తీసుకోకపోతే, ప్రజల దృష్టిలో ప్రభుత్వం పట్ల ఒకింత అసహనం పెరిగే అవకాశమూ లేకపోలేదు.