కరోనా వ్యాక్సిన్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో త్వరలోనే వ్యాక్సినేషన్ ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో అన్ని సజావుగా సాగేలా చేయడానికి వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి బుధవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకు సీఎం కాన్పరెన్సు హాల్లో సీఎస్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి చేపట్టాల్సిన వివిధ ఏర్పాట్లపై ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.
ఈసందర్భంగా సీఎస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తొలివిడతలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ హెల్త్ కేర్ సిబ్బందితో పాటు ఐసీడీఎస్ వర్కర్లు కలిపి 3లక్షల 70వేల మంది హేల్త్‌కేర్ వర్కర్లకు కోవిడ్ వ్యాక్సిన్ అందించడం జరుగుతుందని తెలిపారు. అలాగే, 50 యేళ్ళ వయస్సు నిండి చక్కెర వ్యాధి, హైపర్ టెన్సన్, క్యాన్సర్ ఊపిరి తిత్తులు వ్యాధితో ఇబ్బంది పడే వారికి కూడా తొలి విడత ఇంజక్సన్లు వేయడంలో ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదిత్యానాధ్ దాస్ స్పష్టం చేశారు.
అయితే, మొదటి ప్రాధాన్యతా క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు లేదు. ప్రభుత్వం అత్యవసరంగా భావిస్తే జగన్ మోహన్ రెడ్డికి వేయవచ్చు. అలాగే, ఆయన వయసు కూడా 50 ఏళ్ల కంటే తక్కువ కాబట్టి, మొదట హెల్త్ కేర్ వర్కర్లకు ప్రాధాన్యం ఇచ్చి, ఆ తర్వాత మిగిలిన ముఖ్యులకు వేస్తారు. రాష్ట్ర స్థాయిలో సీఎస్ అధ్యక్షతన వైద్య ఆరోగ్య,హోం శాఖల ముఖ్య కార్యదర్శులతో పాటు మరికొందరు కార్యదర్శులతో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ నెలకు ఒకసారి సమావేశమై కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఎప్పటికప్పడు సమీక్షిస్తుందని సీఎస్ తెలిపారు.