ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కి కరోనా ..చికిత్స కోసం చెన్నై అపోలోకి !

ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా మహమ్మారి జోరు కొనసాగుతూనే ఉంది. ఒక రోజు తక్కువగా , మరో రోజు ఎక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా కూడా పూర్తిగా కంట్రోల్ అవ్వడంలేదు. అలాగే ఏపీలో కరోనా మహమ్మారి భారిన పడే ప్రముఖుల సంఖ్య కూడా భారీగానే పెరుగుతుంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు , ఎంపీలు కరోనా మహమ్మారి భారిన పడగా … తాజాగా మరో ఎంపీకి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది.

తాజాగా ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్దారణ అయింది. కరోనాకు సంబంధించి స్వల్ప లక్షణాలు కనిపించడంతో శ్రీనివాసులు రెడ్డి కరోనా వైరస్ నిర్దార టెస్టులు చేయించుకున్నారు. ఈ టెస్టుల ఆధారంగా వైద్యులు ఆయన కు కరోనా సోకినట్టు నిర్ధారించారు. దీనితో వెంటనే ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో కరోనా చికిత్స కోసం జాయిన్ అయ్యారు. ప్రస్తుతం వైద్యులు ఆయనను ఐసోలేషన్ ‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

అయితే, తాను ఆరోగ్యంగానే ఉన్నానని శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు. మరోవైపు ఎంపీ శ్రీనివాసులు రెడ్డికి కరోనా అని తెలియడంతో ఆయన అభిమానులు, ఒంగోలు వైసీపీ శ్రేణులు తీవ్ర ఆందోళనలో వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకుని రావాలని కోరుకుంటున్నారు.