ఏపీ మాజీ మంత్రికి కరోనా పాజిటివ్ !

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. క‌రోనా వైర‌స్ నుంచి ఇంకా కోలుకోక‌ముందే మ‌రో కొత్త క‌రోనా వైర‌స్ మ‌రింత భ‌యాందోళ‌న‌కు గురి చేస్తోంది. సామాన్యుల నుండి ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరు కూడా కరోనా మహమ్మారి భారిన పడుతున్నారు. ఇప్పటికే ఏపీకి చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు కరోనా భారిన పడగా .. తాజాగా మరో రాజకీయ నేత కరోనా భారిన పడ్డారు.

టీడీపీ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన ఆయన, తనకు కొవిడ్ పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం తానిప్పుడు ఆరోగ్యంగానే ఉన్నానని, ఇంట్లోనే హోమ్ క్వారంటైన్ లో ఉండి చికిత్సను పొందుతూ విశ్రాంతి తీసుకుంటున్నానని ఆయన తన సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు.

ఇటీవలి కాలంలో తనను కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండాలని, ముందు జాగ్రత్త చర్యగా అందరూ కరోనా టెస్ట్ చేయించుకోవాలని ఆయన సూచించారు. కాగా, సోమిరెడ్డి గత కొన్ని రోజులుగా విస్తృతంగా పర్యటనలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆయనకు మహమ్మారి సోకినట్టు తెలుస్తోంది.