(యనమల నాగిరెడ్డి)
రాజకీయాలలో శాశ్వత శత్రువులు కానీ, మిత్రులు కానీ ఉందరన్న నానుడి ఎంత నిజమైనా, నైతికవిలువలకు తిలోదకాలిచ్చి ఏర్పడిన కాంగ్రెస్-టీడీపీ పొత్తుకు నిరసనగా సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీమంత్రి సి.రామచంద్రయ్య కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు శనివారం రాజీనామా చేశారు.
ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను పీసీసీ అధ్యక్షుడికి, ఏఐసీసీ అధ్యక్షుడికి పంపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పతనం కావడానికి ప్రధాన కారణం టీడీపీ అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన టీడీపీ రాష్ట్ర విభజనకు కాంగ్రెసే కారణం అంటూ నానా యాగీ చేసి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ను భూస్థాపితం చేసింది చంద్రబాబు కాదా అని ఆయన ప్రశ్నించారు.
ఏపీలో కాంగ్రెస్ దయనీయ స్థితికి కారణమైన చంద్రబాబుతో కలిసి పని చేయవలసిన దుస్థితి వస్తే క్రిందిస్థాయి కార్యకర్తలకు ఎమి సమాధానం చెప్పాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తమ రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్ నాయకులు తెలుగు రాష్టాలలో నోరు మెదపలేక పోవచ్చు. తమ సర్వం పార్టీకి ధారపోసిన కార్యకర్తలు ఈ అనైతిక పొత్తును జీర్ణించుకోలేరని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ రాజకీయాలను శాసించిన కాంగ్రెస్ అధినాయకత్వం ఈ రోజు తన స్థాయిని దిగజార్చుకుంటూ నానా పాట్లు పడుతూండటం దారుణమని ఆయన వాపోయారు.
ప్రజాస్వామ్య ద్రోహి చంద్రబాబు
రామచంద్రయ్య తెలుగు రాజ్యం విలేఖరితో మాట్లాడుతూ ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి పట్టిన తీవ్ర గ్రహణం “చంద్ర గ్రహణమని”, అటువంటి వారితో పొత్తు వల్ల కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుతుందని ప్రశ్నించారు.
టీడీపీలో ఉన్నపుడు తనకు వ్యక్తిగతంగా చంద్రబాబు ఎంతో విలువ ఇచ్చినా, రాజకీయాలలో ఆయన తీసుకుంటున్న వివాదాస్పద, అనైతిక నిర్ణయాలను అంగీకరించలేక టీడీపీ నుంచి బయటకు వచ్చానని ఆయన గుర్తుచేసుకున్నారు.
రాష్ట్ర విభజన సమయంలో చంద్రబాబు ఆడిన ” రెండు కళ్ళ” డ్రామాను జనం ఎప్పటికీ మరచిపోలేరని, రాష్ట్రంలో కాంగ్రెస్ నేటి పరిస్థితికి బాబే కారణమన్న కఠోర సత్యాన్ని పార్టీ కార్యకర్తలు కూడా మరచిపోలేరని అన్నారు.
ముఖ్యమంత్రి గా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో సాగిస్తున్న పాలన ప్రజాస్వామ్యయుతం అని ఎవరైనా( ఏపీసీసీ అధ్యక్షుడితో సహా)
చెప్పగలరా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలు తెలిపే నిరసనలను బాబు గారు ఎంత కటినంగా అణచివేస్తున్నారో అందరూ గమనిస్తున్నారని అన్నారు.
“దేశాన్ని” కాపాడుదాం….
చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ ఇరువురూ కలసి “దేశాన్ని కాపాడటానికి” తాము జత కలుస్తున్నామని ప్రకటించారు. అయితే వారు “ఏ దేశాన్ని కాపాడుతారో” చెప్పలేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని చంపిన టీడీపీ నాయకులు, రోజుకో డ్రామా ఆడుతూ, రాష్ట్రాన్ని అవినీతికి నిలయంగా మార్చారు. ప్రస్తుతం మునగడానికి సిద్ధంగా ఉన్న టీడీపీ(తెలుగుదేశం)ని కాపాడటానికి మాత్రం ఈ పొత్తు ఉపయోగపడుతుందని చంద్రబాబు కొత్త డ్రామాకు తెర తీశారని ఆయన ఆరోపించారు. ఈ దెబ్బకు రాష్ట్రంలో అంపసయ్యపై ఉన్న కాంగ్రెస్ పూర్తిగా తుడిచి పెట్టుకుని పోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తన రాజీనామా ను వెంటనే ఆమోదించాలని ఆయన పార్టీని కోరారు.