నవంబర్ 13న వైస్సార్ కాంగ్రెస్ లో చేరనున్న రామచంద్రయ్య

(యనమల నాగిరెడ్డి)

టీడీపీతో కాంగ్రెస్ పొత్తుకు నిరసనగా కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసిన మాజీమంత్రి, సీనియర్ నాయకుడు, రాజకీయ ఎత్తుగడలు వేయడంలో ఘనాపాటీ అయిన సి.రామచంద్రయ్య త్వరలో వైస్సార్ పార్టీ తీర్థం పుచ్చుకొనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

రామచంద్రయ్య రాజకీయ జీవితం

ఆడిటర్ గా మంచి పేరున్న రామచంద్రయ్య మొదట కాంగ్రెసు పార్టీ యువజన విభాగం లో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డితో పాటు రాజకీయ జీవితం ఆరంభించారు. ఆ తర్వాత 1983 లో ఎన్టీఆర్ టీడీపీ స్థాపించడంతో ఆయన టీడీపీలో చేరారు. అనతికాలంలోనే ఆయన ఎన్టీఆర్ కు సన్నిహితుడై పార్టీకి చెందిన ఆర్థికపరమైన అంశాలు నిర్వహించడంతో పాటు, ట్రబుల్ షూటర్ గా వ్యవహరిస్తూ పార్టీలో నాయకుల మధ్య ఏర్పడిన విభేదాలను పరిష్కరించడం లాంటి పనులు చేసి ఎన్టీఆర్ కున్న ముఖ్య సలహాదారులలో ఒకరుగా గుర్తింపు పొందారు. అలాగే కడప ఎం.ఎల్.ఏ గాను, మంత్రిగాను పనిచేశారు. 1996 టీడీపీ సంక్షోభంలో చంద్రబాబు వైపు నిలిచి పార్టీలో కీలక పాత్ర పోషించారు. రాజ్యసభ సభ్యుడుగా రెండు పర్యాయాలు పనిచేసి అనేక కీలకమైన కమిటీలకు చైర్మన్ గాను, కమిటీ సభ్యుడు గాను సేవలందించారు.

ఆ తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేయడం, ఆ పార్టీలో కీలక రాజకీయ సలహాదారుగా తన సేవలు అందించడాం జరిగింది. పార్టీ అధినేత చిరంజీవికి అతి ముఖ్యుడుగా ఉన్న ఆయన ప్రజారాజ్యం కాంగ్రెసు లో విలీనమైన తర్వాత వైస్సార్ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు.

రాయలసీమ కోసం

రాష్ట్ర విభజన సమయంలో ఆయన రాయలసీమ అవసరాల గురించి, రాష్ట్ర విభజన వల్ల రాయలసీమకు జరిగే అన్యాయాన్ని గురించి అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలసి వినతి పత్రం సమర్పించారు. రాయలసీమ సమస్యలపై అప్పటి కేంద్ర ప్రభుత్వానికి లేఖల వ్రాసిన ఏకైక మంత్రి రామచంద్రయ్య. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెసు లో కొనసాగుతూ, రాయలసీమ సమస్యల పరిష్కారం కోసం గత 3 సంవసత్సరాలుగా తన వంతు ప్రయత్నం చేస్తున్నారు.

పార్టీ స్థితి ఎలాఉన్నా కాంగ్రెసు లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు సన్నిహితులతో చెప్పేవారు. అయితే కాంగ్రెస్ పార్టీకి ఆజన్మ శత్రువైన చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీతో పొత్తు పెట్టుకోవడం అంగీకరించని ఆయన ఇటీవల కాంగ్రెసు కు గుడ్ బై చెప్పిన విషయం విదితమే.

అందుతున్న సమాచారం మేరకు గత కొంత కాలంగా టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు, రామచంద్రయ్యను టీడీపీలో చేర్చుకోడానికి ప్రయత్నించారు. అయితే రాజకీయంగా చంద్రబాబు తో ఏర్పడిన విభేదాలు, ఆయన తీసుకుంటున్న “సమయానుకూల అవకాశవాద రాజకీయ నిర్ణయాలు” ఆమోదయోగ్యం కాక పోవడం వల్ల టీడీపీని వీడి ప్రజారాజ్యం లో చేరానని, తిరిగి టీడీపీలో ఎలా చేరగలనని ఆయన ఆ రాయబారులను ప్రశ్నించారు. అలాగే తాను రాలేనని కూడా చంద్రబాబుకు గతంలోనే తేల్చి చెప్పారట.

కాగా ఆయన కాంగ్రెసుకు రాజీనామా చేసిన తర్వాత బీజేపీ రాష్ట్ర అగ్రనాయకులు తమ పార్టీలో చేరాలని చేసిన ప్రతిపాదనను రామచంద్రయ్య సున్నితంగా తిరస్కరించారని తెలుస్తున్నది. అలాగే జనసేన నాయకుల ప్రతిపాదనను కూడా ఆయన అంగీకరించలేదని రామచంద్రయ్య సన్నిహిత వర్గాలు తెలిపాయి.

అయితే ఈ ప్రతిపాదనలన్నింటినీ ప్రక్కన పెట్టిన రామచంద్రయ్యను తమ పార్టీలో చేర్చుకోవడానికి వైస్సార్ పార్టీ గత కొంత కాలంగా చేస్తున్న ప్రయత్నాలు, ఆయన రాజీనామా తర్వాత తీవ్రం చేశారని, ఆ ప్రయత్నాలు ఫలించనున్నాయని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. త్వరలో రామచంద్రయ్య వైస్సార్ పార్టీలో చేరడానికి నవంబర్ 13 వతారీఖున ముహూర్తం కూడా ఖరారైందని, ఆయన పార్టీ అధినేత జగన్ సమక్షంలో వైస్సార్ పార్టీ కండువా కప్పుకోనున్నారని వారు తెలిపారు.