వైసిపిలోకి సిఆర్…జగన్ ఏం భరోసా ఇచ్చారో ?

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సి. రామచంద్రయ్య వైసిపిలో చేరనున్నట్లు సమాచారం. కడపకు చెందిన సి. రామచంద్రయ్య రాజకీయ జీవితం తెలుగుదేశంపార్టీతో మొదలైంది. కాలక్రమేణా అనేక పార్టీలు మారారు. కాంగ్రెస్ హయాంలో దేవాదాయశాఖను నిర్వహించారు. ఈమధ్యనే శాసనమండలి సభ్యత్వం ముగిసిన విషయం అందరికీ తెలిసిందే. అదే సమయంలో కాంగ్రెస్, చంద్రబాబునాయుడు మధ్య పొత్తు కూడా కుదిరింది. పొత్తులను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఎలాగూ కాంగ్రెస్ పార్టీలో ఉంటే రాజకీయంగా భవిష్యత్తుండన్న విషయం సిఆర్ కు బాగా తెలుసు. అందుకనే వైసిపినో లేకపోతే జనసేనలోకో వెళ్ళాలని నిర్ణయించుకున్నారు.

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయగానే సిఆర్ జనసేనలో చేరుతారని అందరూ అనుకున్నారు. దానికి తగ్గట్లే జనసేన కీలక నేతలు కూడా రామచంద్రయ్యతో మంతనాలు జరిపారు. దాంతో సిఆర్ జనసేనలో చేరటం లాంఛనమే అనుకున్నారు. అటువంటిది అనూహ్యంగా తాను వైసిపిలో చేరనున్నట్లు తన సన్నిహితులకు సిఆర్ చెప్పారని సమాచారం.  దాంతో విషయం బయటకుపొక్కింది. దానికితోడు జరుగుతున్న ప్రచారాన్ని కూడా రామచంద్రయ్య ఖండించకపోవటంతో ఆయన వైసిపిలో చేరటం ఖాయమనే అనుకోవాలి.

అయితే, వైసిపిలో చేరనున్న సిఆర్ కు ఎటువంటి భరోసా లభించిందో తెలీదు. నిజానికి సిఆర్ కు జిల్లా రాజకీయాల్లో ఏమంత పట్టులేదు. ఆయనెపుడూ మాస్ లీడర్ కాదన్న విషయం అందరికీ తెలిసిందే. టిడిపిలో ఉన్నపుడు కూడా రాజ్యసభ సభ్యునిగా నామినేట్ అయ్యారే కానీ ప్రత్యక్ష ఎన్నికల ద్వారా గెలవలేదు. పోటీ చేసినా ఒక్కసారి ఓడిపోయారు. అందుకే కాంగ్రెస్ లో పిఆర్పి విలీనమైనపుడు కూడా ఒప్పందంలో భాగంగా ఎంఎల్సీ గా నామినేట్ అయి మంత్రిపదవి అందుకున్నారు. కాబట్టి రేపటి ఎన్నికల్లో సిఆర్ కు టిక్కెట్టు అయితే వచ్చే అవకాశాలు లేవు. మరి ఏ విధమైన భరోసాతో రామచంద్రయ్య వైసిపిలో చేరుతున్నారో చూడాలి.