వనపర్తిని వదులుకుంటున్న జి చిన్నారెడ్డి

సాధారణంగా సిటింగ్ ఎమ్మెల్యేలు స్థానం మారరు. మారాలంటే చాలా బలమయిన కారణం ఉండాలి. అందుకే పార్టీల మధ్య పొత్తులు కుదిరినా సిటింగ్ అసెంబ్లీ స్థానాలు తమకే దక్కేలా సీట్ల సర్దు బాబు చేసుకుంటూ ఉంటాయి. నియోజక వర్గం మార్చేందుకు కూడా సిటింగ్ లు  ఒప్పుకోరారు. అలాంటిది, ఇపుడు తెలుగుదేశం పార్టీతో జరుగబోతున్న సీట్ల సర్దుబాటులో ఒక  ముఖ్యమయిన సిటింగ్ నియోజకర్గాన్ని తెలుగుదేశం పార్టీకి ఇచ్చేందుకు  కాంగ్రె స్ సిద్ధమయిందని తెలిసింది. ఆ నియోజకవర్గమే వనపర్తి. టిడిపి పొత్తు విజయవంతం కావాలని తనకు ఇంత కాలం అండగా నిలిచిన  నియోజకవర్గానికి చిన్నన్న వదులుకునేందుకు రెడీ అయ్యారు.

వనపర్తి జిల్లాకు చెందిన ఈ నియోజకర్గం నుంచి 2014లో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ జి చిన్నా రెడ్డి గెలుపొందారు. అపుడు టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన రావుల చంద్రశేఖర్ రెడ్డి  మూడో స్థానంలో ఉన్నారు. రెండో స్థానం టిఆర్ ఎస్ అభ్యర్థికి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి దక్కింది. వనపర్తి నియోజకవర్గంలో చిన్నా రెడ్డికి మంచిపేరుంది. ఆ నియోజకవర్గం నుంచి ఆయ నాలుగు సార్లు గెలుపొందారు. 2009లో ఓడిపోయినా, టిఆర్ఎస్ సుడిగాలిలో  2014 లో మళ్లీ గెలుపొందారు.

రావుల చంద్రశేఖర్ రెడ్డి

 రాజకీయాల్లో ఆయన చిరకాల ప్రత్యర్థి తెలుగుదేశానికి చెందిన రావుల చంద్రశేఖర్ రెడ్డి. ఈ వైరం రాజకీయాలకే పరిమితం. వారిరువురు మంచి స్నేహితులు. క్లాసు మెట్స్ కూడా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రావులను చిన్నారెడ్డి కాంగ్రెస్ లోకి  అహ్వానించారు. అంతేకాదు, రావుల కాంగ్రెస్ పార్టీ లో చేరితే, తన వనపర్తి  నియోజకవర్గాన్ని ఆయనకు అప్పగిస్తానని కూడా చెప్పారు. రావుల కాంగ్రెస్ లోకి వచ్చే వాడే మో గాని, ఈ లోపు కాంగ్రెస్ టిడిపిలు  టిఆర్ ఎస్ ను ఓడించేందుకు దగ్గరవడంతో  రావుల పార్టీ మారడం మానేశారని చెబుతారు.

అయినా సరే, పొత్తులో భాగంగా వనపర్తి నియోజకవర్గాన్నిరావుల చంద్రశేఖర్ రెడ్డి కి వదలుకునేందుకు జి చిన్నారెడ్డి సుముఖంగా ఉన్నారని విశ్వసనీయంగా తెలిసింది. దీనితో  తెలుగుదేశం పార్టీ కోరుతున్న సీట్ల జాబితాలోకి వనపర్తి కూడా వచ్చిందంటున్నారు. పార్టీకి తన అభిమతం తెలియచేశారని కూడా చెబుతున్నారు.

మరి చిన్నారెడ్డి  పోటీ ఎక్కడ?

మరి చిన్నారెడ్డి పరిస్థితి ఏమిటనే ది ప్రశ్న.  రావుల చంద్రశేఖర్ రెడ్డి కి వనపర్తి ఏరియాలో మాత్రమే పలుకుబడి ఉంది. అందుకే ఆయన వనపర్తి కావాలంటున్నారు.  చిన్నారెడ్డి, రావుల కలిస్తే అక్కడ రావుల గెలవడం ఖాయం.  అలాంటపుడు ఆ సీటు ను తిరస్కరించడం బాగుండదని, తానే మరొక నియోజకవర్గానికి వెళ్తానని చిన్నారెడ్డి చెప్పినట్లు సమాచారం.  చిన్నారెడ్డి పక్కనే ఉన్న దేవర కద్ర నియోజవర్గం నుంచి పోటీ చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. చిన్నారెడ్డికి సంబంధించి దేవరకద్ర, వనపర్తికి తేడా ఉండదు. పూర్వ వనపర్తి కి చెందిన కొన్ని మండలాలు పునర్వ్యవస్థీకరణలో దేవరకద్రలో వెళ్లాయి. ఇవి చిన్నారెడ్డి కుటుంబానికి  బాగా పలుకుబడి ఉన్న ప్రాంతాలు. అందువల్ల దేవరకద్ర నుంచి పోటీ చేసినా గెలుస్తానని చిన్నారెడ్డి ధీమాగా ఉన్నారని చెబుతున్నారు.

ప్రస్తుతం దేవర కద్ర నియోజకవర్గం టిఆర్ ఎస్ చేతిలో ఉంది.  2014లో అక్కడి నుంచి ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి గెలుపొందారు. ఇపుడు కూడా ఆయన పేరునే ముఖ్యమంత్రి టిఆర్ ఎస్ అభ్యర్థిగా ప్రకటించారు.