ఆంధప్రదేశ్ లో నాలుగు రాజకీయ పార్టీల పరిస్ధితి స్ధూలంగా ఇలాగే ఉంది. విచిత్రమేమిటంటే, ఐదేళ్ళ క్రిందట పెట్టిన జనసేన పరిస్ధితికి దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్, వామపక్షాలు, బిజెపిల పరిస్ధితికి పెద్దగా తేడా కనిపించటం లేదు. షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో కూడా పై పార్టీల తరపున పోటీ చేయటానికి చాలా నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులే కనబడటం లేదంటే వాటి పరిస్ధితి ఎంత దయనీయంగా ఉందో అర్ధమైపోతోంది. ఒకవైపు తెలుగుదేశంపార్టీ, మరోవైపు వైసిసిల్లో నేతలు నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం కోసం అధినేతలపై ఒత్తిళ్ళు పెడుతున్న విషయం అందరూ చూస్తున్నదే.
మొదటగా జనసేన విషయమే తీసుకుంటే, పార్టీ మొత్తం మీద పవన్ కల్యాణ్ తప్ప గట్టి నేత అనుకున్న వాళ్ళు మరొకరు కనిపించటం లేదు. చివరకు టిడిపి, వైసిపిల్లోని కాపు నేతలు కూడా ఇంత వరకూ జనసేనలో చేరలేదంటే ఆశ్చర్యమేస్తోంది. అంటే కాపుల్లోనే జనసేనపై పెద్దగా నమ్మకం ఉన్నట్లు లేదనే అనిపిస్తోంది. వంగవీటి రాధా, బోండా ఉమ లాంటి సీనియర్ నేతలు జనసేనలో చేరబోతున్నారనే ప్రచారం చివరకు ప్రచారంగానే మిగిలిపోతుందేమో ? పైగా కాపు జేఏసిలోని నేతలు తాజాగా జగన్ సమక్షంలో వైసిపి కండువాలు కప్పుకోవటం విచిత్రంగా ఉంది.
ఇక వామపక్షాల పరిస్ధితి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిది. ఉండటానికి దశాబ్దాల చరిత్రే ఉన్నా పార్టీల పరిస్ధితి రోజురోజుకు దిగజారిపోతోంది. గత చరిత్రను చెప్పుకుని కాలం వెళ్ళదీస్తున్నాయి. టిడిపికో లేకపోతే కాంగ్రెస్ కో తోకపార్టీల్లాగ మారిపోయిన వామపక్షాలు రానున్న ఎన్నికల్లో పై రెండుపార్టీలను వదిలేసి కొత్తగా జనసేనతో జత కడుతున్నాయి. కాబట్టి వాటి అదృష్టరేఖ ఏమన్నా మారి చెరి నాలుగు సీట్లు గెలుచుకుంటాయేమో చూడాలి. జనసేన-వామపక్షాలు కలవటం వల్ల ఎవరు లాభపడతారు ? ఎవరు నష్టపోతారు ? అన్ని చూడాల్సిందే. అసలు పై పార్టీలకు అన్ని చోట్ల గట్టి అభ్యర్ధులు దొరికితే అదే గొప్ప.
కాంగ్రెస్, బిజెపిల పరిస్ధితి కూడా ఇంతకన్నా భిన్నంగా ఏమీ లేదనే చెప్పాలి. నిజానికి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఘనమైన చరిత్రే ఉంది. 2014లో రాష్ట్ర విభజన చేసి తన గోతిని తానే తవ్వుకుంది. దాంతో జనాలు ఏపిలో కాంగ్రెస్ పార్టీకి ఘోరీ కట్టేశారు. అంతే, అప్పటి నుండి పార్టీ కోమా స్టేజిలో ఉందనే చెప్పాలి. పోయిన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధుల్లో సుమారు 165 మందికి అసలు డిపాజిట్లే దక్కలేదంటే పార్టీపై జనాలు ఎంతగా మండుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. అందుకనే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేయటానికి గట్టి అభ్యర్ధులు దొరకటం కష్టమే.
చివరగా బిజెపి గురించి చూద్దాం. కేంద్రంలో అధికారంలో ఉన్నా రాష్ట్రానికి జరిగిన మేలేమీ లేదనే చెప్పాలి. రాష్ట్రాభివృద్ధికి పెద్దగా సహకరించకపోయినా కనీసం నేతలకు కూడా రాష్ట్ర, జాతీయ స్ధాయిలో పెద్ద పదవులు కూడా లభించలేదు. ప్రత్యేకహోదా, ప్రత్యేక రైల్వేజోన్ లాంటివి అమలు చేయకపోవటంతో రాష్ట్ర ప్రజలను బిజెపి మోసం చేసేందనే భావన జనాల్లో పెరిగిపోయింది. రాష్ట్రాభివృద్ధిపై ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు ఎన్నిమాటలు చెప్పినా జనాలు నమ్మేది అనుమానమే. అందుకనే పార్టీ పరిస్దితి చాలా దయనీయంగా తయారైంది. రేపటి ఎన్నికల్లో ఏమి చెప్పి జనాలను ఓట్లడగాలో అర్ధం కావటం లేదు. అందుకే 175 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అసలు గట్టి అభ్యర్ధులు దొరికేది కూడా అనుమానమే. చివరకు టిడిపి, వైసిపి తరపున పోటీ చేసేందుకు అవకాశం రాని నేతలే జనసేన, కాంగ్రెస్, బిజెపిలకు దిక్కవుతారేమో చూడాలి.