అవినాశ్ రెడ్డికి బెయిల్ ముందస్తు… వరుసపెట్టి వివిల్లాడుతున్న ఒక వర్గం మీడియా!

గతకొన్ని రోజులుగా న్యాయస్థానాల్లో వైఎస్సార్ సీపీ కి అనుకూలంగా తీర్పులు వెలువడుతున్నాయనే కారణంతో ఒక వర్గం మీడియా విలవిల్లాడిపోతుంది. ఈ విషయంలో పోలీసులను, సిట్ అధికారులను, సీఐడీ ఆఫీసర్స్ నే కాదు ఏకంగా దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ ని కూడా తీవ్రస్థాయిలో విమర్శించే సాహసానికి తెగించేస్తుంది!

అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టల పంపిణీ విషయంలో టీడీపీ & కో న్యాయస్థానల్లో తీవ్రంగా ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అయితే చాలాకాలం తర్వాత న్యాయస్థానాల్లో ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో… ఇది పేద ప్రజల విజయం అని వైసీపీ నేతలు చెప్పుకున్నారు. అనుకున్నదే తడవుగా పేదలకు పట్టాలు పంపిణీ చేశారు.

అయితే తాజాగా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి… వివేకా హత్యకేసులో ముందస్తు బెయిల్ ఇస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది! అవును… వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌ రెడ్డికి.. తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది ఉన్నత న్యాయస్థానం. అవినాష్‌రెడ్డి లాయర్ల వాదనలతో ఏకీభవించిన హైకోర్టు బెంచ్‌.. షరతులతో కూడిన బెయిల్‌ అవినాష్‌రెడ్డికి మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

దీంతో టీడీపీ నేతలకంటే ఎక్కువగా ఒక వర్గం మీడియా విలవిల్లాడిపోతుంది. సీబీఐ ది తప్పని, వారికి ధమ్ము లేదని, వారు అవినాశ్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించారని తీవ్రస్థాయిలో దుయ్యబడుతుంది. ఇక తాజాగా ఒక అడుగు ముందుకేసి 302 సెక్షన్ కేసులో అసలు బెయిల్ ఇవ్వడం జరగదని.. మూడేళ్లు అనుభవం ఉన్న ఏ జడ్జీ ఈ దిశగా తీర్పు ఇవ్వరని అంటూ… హైకోర్టు న్యాయమూర్తులపై కూడా విమర్శలు చేసే స్థాయికి తెగించేసింది!