తెలంగాణ మహాకూటమి పొత్తు : ఈ 11 సీట్లలో ఫసక్

మహాకూటమి సీట్ల కేటాయింపులో తర్జన భర్జన పడ్డ పార్టీల నేతలు చివరి వరకు కూడా ఓ అవగాహనకు రాలేకపోయారు. సీట్ల కేటాయింపులో స్వంత పార్టీల నేతల నుంచే వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో 11 స్థానాల్లో కూటమి మధ్యనే పోటి ఏర్పడింది. కాంగ్రెస్, తెలంగాణ జన సమితి లు 11 స్థానాల్లో అభ్యర్ధులకు బీఫాంలు అందజేశాయి. దీంతో కూటమిలోనే పోటి ఏర్పడింది.

ముందుగా అనుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ 94 స్థానాల్లో పోటి చేసి 25 స్థానాలు ఇతర పార్టీలకు కేటాయించాలని నిర్ణయించారు. అందులో టిడిపికి 14, జన సమితికి 8, సిపిఐకి 3 స్థానాలు అనుకున్నారు. ఆదివారం రాత్రి వరకు ఈ విషయం పై క్లారిటి ఉన్నా నామినేషన్ల చివరి రోజైన సోమవారం ఉదయానికి పరిస్థితి మారిపోయింది. కాంగ్రెస్ అదనంగా మరో 6 స్థానాల్లో బిఫాంలు అందజేసింది.

చివరకు కాంగ్రెస్ వంద స్థానాల్లో, జనసమితి 14 స్థానాల్లో బిఫాంలు అందజేసింది. ఈ రెండు పార్టీలు 11 స్థానాల్లో పోటి చేస్తుండడంతో వీటి ప్రభావం కూటమి పై పడుతుందని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రచారంలోనూ ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. ఈ రెండు పార్టీలు ఒక అవగాహనకు వస్తే నామినేషన్ ఉపసంహరణ వరకు ఒక క్లారిటి వస్తుందని వారన్నారు.

తెలంగాణ జనసమితికి కేటాయించిన 8 సీట్లలో 3 స్థానాల్లో  మాత్రమే జనసమితి సింగిల్ గా ఉంది. మిగిలిన స్థానాల్లా కాంగ్రెస్ జన సమితి నేతలు తలపడుతున్నారు. వర్ధన్న పేట, సిద్దిపేట, మల్కాజిగిరిలో మాత్రమే జనసమితి అభ్యర్ధులున్నారు. వరంగల్‌ తూర్పు, దుబ్బాక, స్టేషన్‌ ఘన్‌పూర్‌ మెదక్‌, మిర్యాలగూడ, అంబర్‌పేట, ఖానాపూర్‌, అసిఫాబాద్‌, చెన్నూరులలో రెండు పార్టీల అభ్యర్థులకూ బీ ఫారాలు ఇచ్చారు. మహబూబ్‌నగర్‌, అశ్వారావుపేట అసెంబ్లీ స్థానాలను తెలుగుదేశం పార్టీకి కేటాయించగా, ఇక్కడ తెజస అభ్యర్థులు కూడా బరిలోకి దిగారు.

టిడిపి, సిపిఐకి కేటాయించిన స్థానాల్లో మాత్రం ఏ పార్టీ కూడా బీఫాంలు ఇవ్వలేదు. టిడిపికి కేటాయించిన ఇబ్రహీంపట్నం విషయంలోనే మల్లగుల్లాలు ఏర్పడ్డాయి. సామ రంగారెడ్డి ఇబ్రహీంపట్నం నుంచి పోటి చేయడం తనకిష్టం లేదని చెప్పి ఆ తర్వాత చంద్రబాబుతో చర్చలు జరిపి నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆయన సోమవారం ఉదయం ఇబ్రహీంపట్నం లో నామినేషన్ వేసి ఆ తర్వాత ఎల్ బీ నగర్ లోను నామినేషన్ దాఖలు చేశారు. దీంతో నాయకుల్లో సందిగ్ధత ఏర్పడింది. నామినేషన్ ఉపసంహరణ నాటికి ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటి చేస్తారనే దాని పై క్లారిటి వస్తుంది. ఇబ్రహీంపట్నం నుంచి కాంగ్రెస్ సీటు ఆశించిన మల్ రెడ్డి రంగారెడ్డి కూడా స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ వేశారు.

     డివిజన్-  కాంగ్రెస్- తెజస

వరంగల్ తూర్పు-  రవి – ఇన్నయ్య

స్టేషన్ ఘన్ పూర్-ఇందిర- చింతా స్వామి

దుబ్బాక- నాగేశ్వర్ రెడ్డి- రాజ్ కుమార్

మెదక్- ఉపేందర్ రెడ్డి-జనార్ధన్ రెడ్డి

అంబర్ పేట-లక్ష్మణ్ యాదవ్- రమేష్

ఖానాపూర్-రమేష్ రాథోడ్- భీం రావు

అసిఫాబాద్- అత్రం సక్కు-విజయ్

చెన్నూరు- వెంకటేష్- నరేష్

మిర్యాలగూడ- కృష్ణయ్య- విద్యాధర్ రెడ్డి

అశ్వారావు పేట స్థానం నుండి టిడిపి తరపున మచ్చా నాగేశ్వరరావు పోటి పడుతుండగా తెలంగాణ జనసమితి నుంచి కడకం ప్రసాద్ ఉన్నారు. మహబూబ్ నగర్ స్థానం నుంచి ఎర్ర శేఖర్ టిడిపి తరపున పోటి చేస్తుండగా రాజేందర్ రెడ్డి తెలంగాణ జన సమితి నుండి బరిలో ఉన్నారు.

ఈ 11 స్థానాల్లో రెండు పార్టీల నేతలు ఉండటంతో వీరికి మధ్యే పోటి ఏర్పడింది. నామినేషన్ల ఉపసంహరణ నాటికి ఒక క్లారిటి వస్తుందని చర్చల ద్వారా సమస్య పరిష్కరిస్తామని నేతలు తెలిపారు. మహాకూటమిలో సీట్ల లొల్లి ఏ విధంగా సద్దుమణుగుతుందో చూడాలి.