వైఎస్ వివేకా కేసుపై జగన్ స్పందించినట్లేనా?

ఏపీ రాజకీయాల్లో గత మూడు రోజులుగా కీలకమైన అంశాలు జరుగుతున్నాయి. కడప జిల్లా పులివెందులకు చెందిన వైఎస్ భాస్కరరెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఇపుడు వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మీద సీబీఐ విచారణ జరుగుతుంది. అవినాష్ ని ఎప్పుడెప్పుడు అదుపులోకి తీసుకుందామా అన్నట్లుగా సీబీఐ చూస్తుంది! ఈ నేపథ్యంలో… ఈ నెల 25వ తేదీ వరకే అరెస్ట్ నుంచి ఉపశమనం కలిగేలా తెలంగాణా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇవన్నీ ఏపీలో అధికారపార్టీని ఇరుకునపెట్టే విషయాలే!

అయితే ఈ విషయాలపై చట్టం తనపని తాను చేసుకుపోతుందని ఒకరంటే… సీబీఐ విచారణ ఏకపక్షంగా సాగుతుందని మరొకరన్నారు. ఇదే వైసీపీ నుంచి భాస్కర్ రెడ్డి అరెస్టుపై వచ్చిన స్పందన. అయితే… మిగిలిన నేతలు ఎంత స్పందించినా… జగన్ మాత్రం ఈ అంశంపై స్పందించలేదు. గత మూడు రోజుల పరిణామాల మీద జగన్ ఎక్కడా నోరు విప్పలేదు. కానీ… తాజాగా శ్రీకాకుళం జిల్లా టూర్ లో ఉన్న జగన్… నౌపడా వద్ద జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును… వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంపైనా, సీబీఐ చేస్తున్న ఎంక్వైరీ పైనా, ఆ కేసును ప్రతిపక్షాలు రాజకీయంగా ఎలా వాడుకుంటున్నాయి, ప్రభుత్వంపై ఎలా బురదజల్లుతున్నాయనే అంశాలపై జగన్ పరోక్షంగా స్పందించారు! “ఒక అబద్దాన్ని పదే పదే చెప్పడం ద్వారా నిజం చేయలని విపక్షాలు చూస్తున్నాయి” అని జగన్ అన్నారు. దీంతో… భాస్కరరెడ్డి అరెస్ట్, అవినాష్ సీబీఐ విచారణ క్రమంలో వివేకా హత్య కేసులో వారే అసలైన నిందితులు అంటూ విపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని జగన్ ఈ విధంగా తిప్పికొట్టారని అంటున్నారు విశ్లేషకులు!

విపక్షాలు అన్నీ ఏకమయ్యాయని, అబద్ధాలనే వారు ప్రచారం చేయడం ద్వారా తన మీద రాజకీయ దాడిని చేస్తున్నాయని.. జనాలకు జగన్ చెప్పడంలోని ఉద్దేశ్యం కూడా… పరోక్షంగా ఈ కేసుపై స్పందించడమే అని… తాము క్లీన్ గా ఉన్నా ప్రతిపక్షాలు బురద జల్లుతున్నాయని చెప్పడమే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా… అబద్ధాన్ని పదే పదే చెప్పి దాన్ని నిజం చేయాలని చూస్తున్నారంటే… సీబీఐ కూడా ఏకపక్షంగా విచారిస్తోందని చెప్పినట్లు కూడా భావించొచ్చని అంటున్నారు.

దీంతో… వైఎస్ వివేకా హత్య కేసులో జగన్ అభిప్రాయం స్పష్టంగా ఉందని… భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి అసలు నేరస్తులు కాదని, సీబీఐ ఏకపక్షంగా ఎంక్వైరీ చేస్తునట్లు భావిస్తున్నారని కంక్లూజన్ ఇస్తున్నారు విశ్లేషకులు!