సాధారణంగా రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో చెప్పే మాటలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే పనులకూ చాలా మంది విషయాల్లో పొంతన ఉండదనేది తెలిసిన విషయమే! అయితే… ఐదేళ్ల తర్వాత ప్రజలకు అంత గుర్తు ఉండదనే నమ్మకమో.. లేక వారి మాటలపై వారికున్న అతివిశ్వాసమో తెలియదు కానీ.. గతంలో ఏమి మాయ చేశామనే విషయాలను దాటవేస్తూ.. ఫ్రెష్ కబుర్లు చెబుతుంటారు.
మరి 2019 ఎన్నికల సమయంలో జగన్ ఎన్నో హామీలను ఇచ్చారు. చంద్రబాబు అప్పటికే 2014 – 19 మధ్య ప్రజలకు భారీగా షాకులు ఇవ్వడంతో ఇక ఆయనను లైట్ తీసుకున్నంత పనిచేశారు. ఈ సమయంలో గత ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీలలో నవరత్నాలు 90శాతానికి పైగా హామీలు అమలయ్యాయని చెబుతున్నారు. ఈ క్రమంలో గత ఐదేళ్లలో జగన్ ఏమి చేశారనేది ఇప్పుడు చూద్దాం!
వాస్తవానికి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో వచ్చిన మార్పులు, జరిగిన విషయాలు ఏమిటనేది కేంద్రప్రభుత్వ సంస్థలు ఇచ్చిన ఘణాంకాల ప్రకారమే పరిశీలిస్తే… చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో అప్పులు 169 శాతం పెరిగితే, జగన్ వాటిని 58 శాతానికి తగ్గించారని కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక శాఖ లెక్కలు చెబుతున్నాయని అంటున్నారు!
దీంతో… సంక్షేమ పథకాలను అమలు చేసి జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారనే విమర్శలకు ఇది చెంపపెట్టని అంటున్నారు విశ్లేషకులు.
ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో జగన్ 99 శాతం అమలు చేశారని లెక్కలు చెబుతున్నాయి! వీటిలో ప్రధానంగా… సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో 87 శాతం కుటుంబాల ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లు జమ చేశారని వైసీపీ లెక్కలు చెబుతుంది. దీనికి టీడీపీ అంగీకరిస్తూనే… తాము అధికారంలోకి వస్తే ఇవి కంటిన్యూ చేస్తామని చెబుతుంది.
ఇదే సమయంలో… 31 లక్షల మంది మహిళలకు ఇంటి స్థలాలవంటి నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1.79 లక్షల కోట్ల మేర ప్రయోజనం కలిగించారని అంటున్నారు. ఇలా మొత్తంగా.. డీబీటీ, నాన్ డీబీటీ కలిపితే రూ.4.49 లక్షల కోట్ల వరకూ ఏపీలో పేద ప్రజలకు, పేద కుటుంబాలకు ప్రయోజనం కలిగిందనేది వైసీపీ సర్కార్ ధీమాగా చెబుతున్న మాటగా ఉంది.
ఈ క్రమంలో ఎక్కడా అవినీతికి తావులేకుండా జగన్ జాగ్రత్త పడటంతో… రాష్ట్రంలో పేదరికం క్రమేణా తగ్గుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా… రాష్ట్రంలో పేదరికం 2015-16 నాటికి 11.77 శాతం ఉండగా 2022-23 నాటికి 4.19 శాతానికి తగ్గింది. అన్నింటికంటే ప్రధానంగా… కరోనా కష్టకాలంలోనూ జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను కొనసాగించిన సంగతి తెలిసిందే!
ఇక అభివృద్ధి కోటా విషయానికొస్తే… సంగం, నెల్లూరు బ్యారేజ్, లక్కవరం ఎత్తిపోతల, వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ, అవుకు టన్నెల్ లతో పాటు చంద్రబాబు నియోజకవర్గంలోని కుప్పం బ్రాంచ్ కెనాల్ లను పూర్తి చేసి జగన్ జాతికి అంకితం చేశారు! ఇదే క్రమంలో… జగన్ సర్కార్ చేపట్టిన నూతన పారిశ్రామిక విధానం వల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ అగ్రస్థానంలో నిలుస్తోందని లెక్కలు చెబుతున్నాయి!
ఇక గతంలో ఎన్నడూ లేనివిధంగా జగన్ ప్రభుత్వ హయాంలో… నాలుగు ఓడరేవులు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, పది షిప్పింగ్ హార్బర్లు, మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు, పది ఇండస్ట్రియల్ నోడ్స్ తో పారిశ్రామిక ప్రగతి సాధించారనే చెప్పాలి! ఫలితంగా… పారిశ్రామికాభివృద్ధి రేటు విషయంలో రాష్ట్రం 2018-19 నాటికి 3.2 శాతంతో 22వ స్థానంలో ఉండగా.. 2021-22 నాటికి 12.8 శాతం వృద్ధి రేటుతో మూడో స్థానానికి ఎగబాకింది.
ఇక ప్రధానంగా వ్యవసాయం, వైద్య రంగాల్లో జగన్ ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. గ్రామ గ్రామాల్లోనూ ప్రభుత్వ వైద్యాన్ని గుమ్మం ముందుకు తీసుకొచ్చారని చెబుతున్నారు! ఇక ప్రభుత్వ పాఠశాలల్లో పేద పిల్లల విద్యలో జగన్ తీసుకొచ్చిన మార్పుల గురించి చెప్పేపనే లేదని అంటున్నారు!
ఈ క్రమలోనే తాజాగా విశాఖ జిల్లా పాయకురావు పేట నియోజకవర్గంలో పర్యటించి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న చంద్రబాబు… తాము అధికారంలోకి వస్తాం – జగన్ సంక్షేమ పథకాలను కొనసాగిస్తాం అని ప్రకటించారు. దీంతో… వైసీపీ నేతలు చంద్రబాబు పరిస్థితి ఇదంటూ ఎద్దేవా చేస్తున్నారు!!