అదేంటో, వైసీపీ అనుకూల మీడియా కంటే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఎక్కువ సంబరపడుతోంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, విశాఖ నుంచి పరిపాలన చేపట్టబోతున్నారంటూ.! రాజకీయాల్లో వెన్నుపోటుకి టీడీపీ బ్రాండ్ అంబాసిడర్ అయితే.. ఆ వెన్నుపోటుకి తెరవెనుకాల కథ, స్క్రీన్ ప్లే.. అంతా ఈ టీడీపీ అనుకూల మీడియాదే.
‘మార్చి నెల మూడో వారంలో విశాఖకు వైఎస్ జగన్.. అక్కడి నుంచే పరిపాలన..’ అంటూ టీడీపీ అనుకూల మీడియా కథనాల్ని ఊదరగొట్టేస్తోంది. కాగా, ఫిబ్రవరి 23న సుప్రీంకోర్టులో మూడు రాజధానుల వ్యవహారానికి సంబంధించి విచారణ జరగనుంది.
‘త్వరలో విశాఖ నుంచే పాలన.. నేను కూడా విశాఖకు షిఫ్ట్ అయిపోతున్నా..’ అంటూ విశాఖపట్నంను రాజధానిగా ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఢిల్లీ వేదికగా ఓ అధికారిక కార్యక్రమంలో ప్రకటించేశారు. ముఖ్యమంత్రి ప్రకటిస్తే విశాఖ రాజధాని అయిపోతుందా.? అన్నది వేరే చర్చ.
అసెంబ్లీలో మూడు రాజధానులకు అనుకూలంగా చేసిన చట్టం, ఎప్పుడో చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది. వైసీపీనే స్వయంగా తాము చేసిన చట్టాన్ని వెనక్కి తీసుకుంది. మళ్ళీ చట్టం చేయాల్సి వుంటుంది ముఖ్యమంత్రి గనుక విశాఖను రాజధానిగా ప్రకటించాలంటే.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆ పని పూర్తి చేసేస్తారా.? అంటే, అది మళ్ళీ వేరే చర్చ. అమరావతికి వెన్నుపోటు పొడిచి, మళ్ళీ ఇప్పుడు వైసీపీ అనుకూల ‘విశాఖ రాజధాని’పై టీడీపీ మీడియా ఎందుకు అత్యుత్సాహం చూపుతోందబ్బా.?