విశాఖ నుంచే సీఎం జగన్ పరిపాలన.! కొద్ది రోజుల్లో.!

ఆలూ లేదు.. చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగమన్నాడట వెనకటికి ఒకడు. లేకపోతే, విశాఖను రాజధానిగా చేసుకుని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలన సాగించడమేంటి.? ఇలా చర్చ జరుగుతోంది సోషల్ మీడియా వేదికగా. ‘ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని.. అంటోంది వైసీపీ. అసలు, రాజ్యాంగంలో రాజధానికి సంబంధించి ఎలాంటి నిర్వచనం వుంది.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. అయితే, విభజన చట్టం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధాని అయ్యింది. సరే, ఆ అమరావతి రాజధాని పేరుతో టీడీపీ చేసిన భూకుంభకోణాలంటూ వైసీపీ చేసే ఆరోపణలది వేరే వ్యవహారం.

రాజధాని అంశం కోర్టు పరిధిలో వుంది. ఒకసారి ఈ విషయం కోర్టు పరిధిలోకి వెళ్ళాక.. వ్యవహారం వేరేలా వుంటుంది కదా.? కానీ, అతి త్వరలో రాజధాని విశాఖ నుంచే వైఎస్ జగన్ పాలన.. అంటున్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. స్వయంగా వైఎస్ జగన్ కూడా ఇదే మాట చెప్పారు మొన్నటి జీఐఎస్ సందర్భంగా.

కోర్టు తీర్పుల్ని ధిక్కరించి మరీ విశాఖ కేంద్రంగా వైఎస్ జగన్ పాలన చేస్తారా.? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే. మూడు రాజధానుల బిల్లు మురిగిపోయింది.. చిరిగిపోయింది.! ఇంకోసారి అసెంబ్లీలో బిల్లు పెట్టాలంటే.. న్యాయస్థానాలు ఒప్పుకోకపోవచ్చు. మరెలా విశాఖ రాజధాని అవుతుందట.?

అధినేత మెప్పు కోసం మంత్రి గుడివాడ అమర్నాథ్, ‘కొద్ది రోజుల్లోనే విశాఖ నుంచి వైఎస్ జగన్ పాలన..’ అంటున్నారు. అమర్నాథ్ మాటలకు ఉప్పొంగిపోయి, వైఎస్ జగన్ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే.. పరిస్థితులు తీవ్రంగా మారొచ్చు.