కరోనా ఎఫెక్ట్: జగన్ సర్కార్ కీలక నిర్ణయం..!

ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపధ్యంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా తీవ్రత కారణంగా ఏ ఆసుపత్రి చూసిన రోగులతో నిండిపోయింది. ఈ నేపధ్యంలో టెస్టులు చేయించుకోవాలన్నా, ఆసుపత్రిలో జాయిన్ కావాలన్నా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందుకే కరోనాపై రోగులకు తగిన గైడ్‌లైన్స్ అందించేందుకు ప్రతి జిల్లాలో 104 కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

అయితే ఈ కాల్ సెంటర్‌లు 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి అందులో షిప్టుకు 5 లేదా 6 మంది ఉద్యోగులు విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే జిల్లా పరిధిలోని కోవిడ్‌ కేర్‌ సెంటర్లు, ఆస్పత్రులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీరు రోగులకు అందించనున్నారు. కరోనా టెస్టుకు వెళ్ళిన వారి ఫలితాల ఆధారంగా బాధితులు ఎక్కడ, ఏ ఆస్పత్రిలో చికిత్స పొందాలనేది కూడా కాల్ సెంటర్ నుంచే సూచించనున్నారు.

ఇదిలా ఉంటే కరోనాపై నేడు సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం జగన్ రాష్ట్ర స్థాయి కోవిడ్‌ ఆస్పత్రులు సంఖ్య 5 నుంచి 10 కి పెంచుతున్నట్లు ప్రకటించారు. జిల్లాలలో ఉన్న 84 కోవిడ్‌ ఆస్పత్రులలో నాణ్యమైన సేవలందించాలని అధికారులను ఆదేశించారు. వైద్య సహాయం కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని, జాగ్రత్తలు పాటిస్తూ సకాలంలో వైద్యం తీసుకోవాలని అన్నారు. ఇక లక్షణాలు లేని కరోనా రోగులు ఇంట్లోనే ఉండి కరోనా నుంచి బయటపడవచ్చని అన్నారు.