రాష్ర్టంలో ఇప్పుడు కరోనా అంటే అంతా లైట్ తీసుకుంటున్నారు. కరోనా ఎప్పుడు ఎలా వచ్చి పోతుందో కూడా తెలియడం లేదని డాక్టర్లు సైతం చెబుతున్నారు. మరీ అంత భయపడాల్సిన పని లేదని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముందే చెప్పారు. ఇప్పుడా మాటను ప్రజలంతా కూడా సమర్ధిస్తున్నారు. కరోనా కొత్తలో జన జీవనం స్థంభించినంత పనైనా ఇప్పుడు పరిస్థితులు అన్ని యాధావిధిగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో రోజు పదివేలకు పైగా కేసులు నమోదవుతున్నా..మరణాల సంఖ్య పెరుగుతున్నా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎవరి పనివాళ్లదే అన్నట్లు సాగుతోంది.
అలాగే పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులు కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశం జరిగిన అనంతరం ఎక్కువగా వైసీపీ ఎమ్మెల్యేలు కరోనా బారిన పడి చాలా మంది కోలుకున్నారు. అందులో తుని నియోజక వర్గ వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కూడా ఒకరు. మరి ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అని ఆరా తీయగా విస్తుపోయే వాస్తవాలు బయటకొస్తున్నాయి. దాడిశెట్టి రాజాకు రెండవసారి కరోనా సోకిందిట. మొదటి సారి సోకినప్పుడు హోమ్ క్వారంటైన్ లో ఉంటూ డాక్టర్ల సూచనలు సలహాలు తీసుకుంటూ వైరస్ నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత కుటుంబం మొత్తానికి వైరస్ సోకింది.
వారు కూడా చికిత్స తీసుకోవడంతో నయమైంది. అయితే మళ్లీ దాడిశెట్టి రాజాపై కరోనా పడగ విప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన విశాఖలోని ఓ కార్పోరేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారుట. కొన్ని రోజులుగా ఆసుపత్రిలోని ప్రత్యేక గదిలో ఉంటూనే చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేరుగా దాడిశెట్టి రాజాకు ఫోన్ చేసి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారుట. అలాగే ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతోనూ జగన్ మాట్లాడినట్లు తెలిసింది. భయపడాల్సిన పనిలేదని ధైర్యం చెప్పినట్లు నియోజక వర్గం ప్రజల ద్వారా తెలుస్తోంది. తొలిసారి కొవిడ్ సోకినప్పుడు జగన్ ఎలాంటి పరామర్శ చేయలేదు. కానీ రెండవసారి వైరస్ సోకడం..పరిస్థితి కాస్త ఆందోళన కరంగా మారడంతోనే ఫోన్ చేసారా? అన్న సందేహాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి.