మాయా ప్రపంచంలో సీఎం జగన్..తప్పు మీద తప్పు అంటూ?

అధికారంలో ఉన్న పార్టీల నేతలు ఇతర పార్టీల నాయకులు చేసే సద్విమర్శలను పట్టించుకొని తమను తాము మార్చుకోవడానికి ప్రయత్నిస్తే గొప్ప రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం ఉంటుంది. తాజాగా చంద్రబాబు తనయుడు, ఎమ్మెల్సీ నారా లోకేశ్ సీఎం జగన్ మాయా ప్రపంచం నుంచి బయటకు రావాలని కామెంట్ చేశారు. కృష్ణా జిల్లాలోని తేంపల్లిలో విషజ్వరాల గురించి ప్రస్తావిస్తూ లోకేశ్ ఈ కామెంట్ చేశారు.

సాక్షి రాతల మాయా ప్రపంచం నుంచి జగన్ బయటకు రావాలని లోకేశ్ కామెంట్లు చేశారు. అయితే సాక్షి పత్రిక విషయంలో సామాన్య ప్రజల నుంచి ఇవే తరహా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సాక్షి పత్రికలో వైసీపీకి వ్యతిరేకంగా ఒక్క వార్త కూడా రావడం లేదు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి చేసిన తప్పులే ప్రస్తుతం సాక్షి పత్రిక చేస్తుండటం గమనార్హం. ప్రభుత్వ పాలన వల్ల ఏపీ ప్రజలంతా సంతోషంగా ఉన్నట్టుగా సాక్షిలో వార్తలు ప్రచురితమవుతున్నాయి.

వాస్తవాలను సైతం సాక్షి పత్రికలో మరో విధంగా ప్రచారం చేస్తుండటంతో ఈ పత్రికకు సర్క్యులేషన్ సైతం అంతకంతకూ తగ్గుతోంది. సాక్షి దినపత్రిక వైసీపీ కరపత్రిక అనే భావన చాలామందిలో ఉంది. సాక్షి దినపత్రికలో ప్రభుత్వానికి అనుకూలంగా మాత్రమే వచ్చే వార్తల వల్ల వైసీపీకి దీర్ఘకాలంలో ఊహించని స్థాయిలో నష్టం కలిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. సీఎం జగన్ మాయా ప్రపంచంలోనే బ్రతికితే 2024 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చినా టీడీపీ, జనసేన పార్టీలు మాత్రం ఏపీలో పుంజుకునే అవకాశాలు అయితే ఉంటాయి.

ఎన్నికలకు ముందు నవరత్నాల పేరుతో హామీలు ఇచ్చిన జగన్ ఆ హామీలను అమలు చేస్తున్నా అన్ని వర్గాల ప్రజల్లో వైసీపీపై అసంతృప్తి ఉంది. పథకాల అర్హతలకు సంబంధించి ఎక్కువ సంఖ్యలో నిబంధనలు విధించడంతో పథకాల ద్వారా ప్రయోజనాలను పొందే లబ్ధిధారుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రజల అభిప్రాయాలకు కూడా జగన్ విలువ ఇస్తే మంచిదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.