CM Chandrababu: శుభవార్త.. దసరా కానుకగా ఖాతాల్లోకి రూ.15వేలు

cm chandrababu

CM Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కీలక ప్రకటన చేశారు. ఆటో డ్రైవర్లకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దసరా పండుగ కానుకగా ఆటో డ్రైవర్లకు రూ.15వేలు ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. ‘సూపర్ సిక్స్-సూర్ హిట్’ విజయోత్సవం సభలో ఈమేరకు ప్రకటించారు. అనంతపురంలో నిర్వహించిన ఈ సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సభలో గత 15 నెలలుగా కూటమి ప్రభుత్వం సాధించి విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. గత 15 నెలల్లో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని తెలిపారు. ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్నికల్లో భాగంగా ప్రజలకు ఇచ్చిన సూపర్‌ 6 హామీలు నెరవేర్చి మాట నిలబెట్టుకుంటున్నామన్నారు. జవాబుదారీతనం, బాధ్యత కలిగిన ప్రభుత్వం తమదని పేర్కొన్నారు. తెలుగు తమ్ముళ్ల స్పీడు.. జనసేన జోరు.. కమలదళం ఉత్సాహానికి ఎదురుందా? అని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. సంక్షేమం అంటే కేవలం ఓట్ల రాజకీయం కాదని.. ప్రజల జీవన ప్రమాణం పెరగాలని స్పష్టం చేశారు.

ఇందులో భాగంగా దసరా పండుగ రోజున వాహన మిత్ర పథకం ప్రారంభిస్తామన్నారు. ఈ పథకంలో భాగంగా ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ.15వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులో ఆటో డ్రైవర్ల జీవనోపాధి ప్రభావితం కాకుండా ప్రత్యేక సాయం అందిస్తామని వెల్లడించారు. ఇక స్త్రీ శక్తి పథకం కింద 2.62 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం పొందుతున్నారని తెలిపారు. ఈ పథకం మహిళల విద్య, ఉపాధి, వ్యాపారం, కుటుంబ అవసరాల కోసం ఉపయోగపడుతుందన్నారు.

రాష్ట్రంలోని ప్రతి పేదవాడి ఆకలి తీర్చాలనే లక్ష్యంతో అన్నా క్యాంటీన్ల ఏర్పాటు చేశామని.. వీటి ద్వారా లక్షల మందికి రూ.5లకే భోజనం అందిస్తున్నామన్నారు. ఇది పేదలపై కూటమి ప్రభుత్వానికి ఉన్న ప్రేమకు నిదర్శనమని స్పష్టం చేశారు. అలాగే ఇతర హామీలను కూడా కష్టమైనా నెరవేరుస్తున్నామని చెప్పారు. పింఛన్ల పెంపు, తల్లికి వందనం, దీపం పథకం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు వంటి హమీలు అములు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని ప్రతి పేదవాడు సంతోషంగా ఉండాలనేదే తమ ప్రభుత్వం లక్ష్యమని చంద్రబాబు వెల్లడించారు. సూపర్ సిక్స్ హామీలు విజయవంవతంగా అమలు చేస్తున్నందునే ఈ విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామన్నారు.