ఏపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మీడియా మొఘల్ ‘ఈనాడు’ రామోజీరావు ఆస్తులను ఏపీ సీఐడీ అటాచ్ చేసింది. మార్గదర్శి కేసుకు సంబంధించి ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. మార్గదర్శి కేసుని గత కొంతకాలంగా విచారిస్తున్న ఏపీ సీఐడి అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఏపీలో ఇదే హాట్ టాపిక్!
మార్గదర్శి చిట్ ఫండ్స్ కు చెందిన 793 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను సీఐడీ అటాచ్ చేసింది. మార్గదర్శిలో చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఫోర్ మెన్ ఆడిటర్ లు కుట్రతో నేరానికి పాల్పడ్డారని ఏపీ సీఐడీ పేర్కొంది. వీటిలో మార్గదర్శి చిట్ ఫండ్స్ నగదు, బ్యాంకు ఖాతాల్లో సొమ్ము, నిబంధనలకు విరుద్ధంగా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టిన పెట్టుబడులున్నాయి.
ఈ మేరకు రాష్ట్ర డిపాజిట్ దారుల హక్కుల పరిరక్షణ చట్టం 1999 ప్రకారం హోంశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయస్థానం అనుమతితో చరాస్తుల జప్తునకు సీఐడీ అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఇదే విషయాన్ని వివరిస్తూ 50 బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్ సంస్థలకు కూడా సమాచారం అందించారు.
ఇప్పటివరకూ మార్గదర్శి విషయంలో పెద్దగా ఎవరూ కేసులు పెట్టిన దాఖలాలు లేవు! కానీ దూకుడు మీదున్న ఏపీ సీఐడీ అధికారులు గత కొంతకాలంగా దర్యాప్తుని ముమ్మరం చేశారు. అదే టైం లో కేసులు కూడా ఎక్కిడికక్కడ నమోదు చేస్తున్నారు. దీంతో రామోజీ కెరీర్ లో 2023 – జూన్ నెల కీలకంగా మారే అవకాశం ఉంది అని అంటున్నారు పరిశీలకులు.
కాగా… సుప్రీం కోర్టులో మార్గదర్శి మీద మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన కేసులో ఖాతాదారులకు చెల్లించిన మొత్తం సొమ్ము వివరాలను వెల్లడించాలని సుప్రీం ఆదేశించిన సంగతి తెలిసిందే!