చిరంజీవి మౌనం.. జనసేనానికి సంకటం.!

Chiranjeevi

చిరంజీవి మౌనం దాల్చితే, పవన్ కళ్యాణ్‌కి సంకటమెలా అవుతుంది.? అవుతుంది, అయి తీరుతుంది. అన్నదమ్ముల మధ్య సఖ్యత లేదన్న ప్రచారం ఖచ్చితంగా జనసేన మీద నెగెటివ్ ఇంపాక్ట్ చూపుతుంది. మరి, అన్నా చెల్లెళ్ళ మధ్య సఖ్యత లేకపోతే, వైసీపీకి అది నెగెటివ్ అవుతుందా.? అవ్వదా.?

వైఎస్ జగన్ ఓ పార్టీ, వైఎస్ షర్మిల ఇంకో పార్టీ పెట్టొచ్చు. వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు, వైఎస్సార్ తెలంగాణ పార్టీకి మద్దతివ్వొచ్చు.. కానీ, చిరంజీవి తన తమ్ముడికి నైతికంగా మద్దతిచ్చి, రాజకీయాల పట్ల మౌనం దాల్చితే.. అది జనసేనకు సంకటంగా మారుతుంది.!

ఇదే, తెలుగునాట రాజకీయాల్లో విచిత్రమంటే. ఇక్కడే, కాపు సామాజిక వర్గమంతా పవన్ కళ్యాణ్ వెంట నడవాలి.. అనే భావనకు బలం చేకూరేలా చేసేది. స్వర్గీయ నందమూరి తారకరామారావు పార్టీని స్థాపిస్తే, ఆయనకు ఎవరూ కులాన్ని ఆపాదించలేదు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ పార్టీని పెట్టినా, కులాన్ని ఆపాదించలేదు.

కానీ, చిరంజీవికీ కులాన్ని ఆపాదించారు.. పవన్ కళ్యాణ్‌కీ కులాన్ని ఆపాదిస్తున్నారు. ఇంత జరుగుతున్నా చిరంజీవి ఎందుకు రాజకీయాలపై మౌనం దాల్చుతున్నారు.? అంటే, చిరంజీవి రాజకీయాల్లో చూడకూడని లోతులు చూసేశారు.

చాలా తక్కువ కాలంలో.. రాజకీయాల గురించి చాలా ఎక్కువ అవగాహన తెచ్చుకున్నారు చిరంజీవి. ప్రజలు మారితే తప్ప, రాజకీయాలు మారవని చిరంజీవికి అర్థమయ్యింది. పవన్ ఎంత గింజుకున్నా, ప్రజల్లో ఆ మార్పు రాదని చిరంజీవికి తెలుసు. కానీ, పవన్ మొండివాడు. ఆ సంగతీ చిరంజీవికి తెలుసు. అందుకే, చిరంజీవి మౌనం దాల్చారు. చిరంజీవి మౌనం దాల్చారని కాదుగానీ.. జనసేనానికి రాజకీయ సంకటమే.. అది చిరంజీవి వల్ల కాదు, ప్రజల మౌనం వల్ల.!