తమ్ముడిపై ప్రేమ.! వాళ్ళపై కసి.! చిరంజీవి మాటల వెనుక.!

మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన తమ్ముడు పవన్ కళ్యాణ్ విషయమై చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. తమ్ముడి మీద చిరంజీవికి ప్రేమ వుండడం తప్పు కాదు.! కానీ, తమ్ముడ్ని రాజకీయంగా విమర్శించేవారి విషయంలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నాయి.

‘వాడ్ని దారుణంగా తిడతారు కొందరు. వాళ్ళు మళ్ళీ నా దగ్గరకు వచ్చి పెళ్ళిళ్ళకు, ఇతర కార్యక్రమాలకు ఆహ్వానిస్తారు.. బాధగా వుంటుంది.. అసహ్యంగా అనిపిస్తుంది.. వెళ్ళాలా.? వద్దా.? అని ప్రశ్నించుకుంటాన్నేను..’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

రాజకీయాల్లో విమర్శలు మామూలే. ఆ సంగతి చిరంజీవికీ తెలుసు. గతంలో ఆయన రాజకీయాల్లో వున్నారు. పైగా, ప్రజారాజ్యం పార్టీని నడిపారు కూడా. అప్పుడు కాంగ్రెస్ పార్టీని పవన్ కళ్యాణ్ నానా రకాలుగా తిడితే, ఆ పార్టీలోనే ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కలిపేశారు.

పవన్ కళ్యాణ్ మీదా రాజకీయంగా విమర్శలు వస్తాయ్. అలా విమర్శించేవాళ్ళలో అత్యధికులు వైసీపీ నేతలే. వాళ్ళు చిరంజీవిని బాగానే గౌరవిస్తారు. కారణాలేవైతేనేం, చిరంజీవిని వైసీపీలో పెద్దగా ఎవరూ తూలనాడరు. చిరంజీవికి వైఎస్ జగన్ ప్రత్యేకంగా గౌరవిస్తున్నారు.

రోజా కూడా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసినా, చిరంజీవి దగ్గరకు వెళ్ళి పలు సందర్భాల్లో మాటామంతీ జరిపారు, మంత్రి పదవి వచ్చాక ఆశీస్సులూ తీసుకున్నారు. జగన్, రోజా తదితరుల మీదనా చిరంజీవి వ్యాఖ్యానించింది.? అని అంతా చర్చించుకుంటున్నారిప్పుడు.