జనసేన పార్టీలోకి చిరంజీవి… సీఎం అభ్యర్థి?

చిరంజీవి సినిమాల్లో మెగాస్టార్.. రాజకీయాల్లో దగా స్టార్ అని అంటుంటారు ప్రజారాజ్యంలో ప్రత్యేక అనుభవాలు చూసినవారు! ప్రజారాజ్యం పార్టీ పెట్టిన కొత్తలో చిరంజీవిని నమ్మి ఆస్తులు అమ్మి రాజకీయాల్లోకి వచ్చినవారు చాలామందే ఉన్నారని అంటుంటారు.

అయితే ఇప్పటి పవన్ కంటే అప్పుడు చిరంజీవికి కాస్త ఎక్కువ సీట్లే వచ్చినప్పటికీ… చిరంజీవి చేతులెత్తేశారు. ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌ లో విలీనం చేసేశారు. అనంతరం కేంద్రమంత్రి పదవి పొందిన చిరంజీవి.. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకు మాత్రమే పరిమితమవుతున్నారు. ఈ సమయంలో సడన్ గా పొలిటికల్ డైలాగులు వేశారు. దీంతో… కొత్త చర్చ తెరపైకి వచ్చింది.

అవును… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలు రాజకీయచర్చకు దారితీశాయి.ఏపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్ ధరల పెంపు సమయంలో కూడా సినీపరిశ్రమ పెద్దగా తాడేపల్లి వచ్చిన చిరంజీవి… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. ఆ తర్వాత కూడా ఒకసారి సీఎం జగన్ తో భేటీ అయ్యారు మెగాస్టార్.

దీంతో… పవన్ విషయంలో జోక్యం చేసుకోకపోవడం, సీఎం జగన్ తో భేటీలతో ఏపీ ప్రభుత్వానికి చిరంజీవి దగ్గరగా ఉన్నారనే చర్చ అప్పట్లో జోరుగా సాగింది. జనసేన పార్టీతో నాగబాబు మాత్రమే ఉన్నారని అందరూ భావించారు. ఏపీ ప్రభుత్వంపై కాలు దువ్వినప్పటినుంచీ… తమ్ముడు పవన్ కళ్యాణ్ వ్యవహారంలో ఆచితూచి అడుగులు వేస్తున్న చిరంజీవి.. ఒక్కసారిగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడటం పెద్ద చర్చగా మారింది.

దీంతో గతంలో నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు గుర్తుకు తెస్తున్నారు పరిశీలకులు. గతంలో ఓ సందర్భంలో… జనసేనకు చిరంజీవి మద్దతు ఉందని మనోహర్ స్పందించారు. తాజాగా చిరు కూడా అలానే స్పందించినట్లు అనిపిస్తుంది. దీంతో… చిరంజీవి తన తమ్ముడు పవన్ కు రాజకీయంగా దగ్గరయ్యారా? జనసేనకు చిరంజీవి మద్దతు ఉంటుందా? అని రాజకీయవర్గాల్లో చర్చ ఊపందుకుంది.

అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే… సినిమాలు – రాజకీయాల కలబోత చర్చ పవన్ నుంచే మొదలయ్యిందని చిరంజీవి గమనించకపోవడం! అందుకే చిరంజీవిపై వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. అసలు చర్చ తన తమ్ముడు పవన్ కళ్యాణ్ తోనే స్టార్ట్ అయిందంటూ విమర్శలు గుప్పించారు. ఈ విషయం చిరు ముందే గ్రహించలేకపోయారా.. లేక, పక్క ప్లాన్ తోనే మొదలుపెట్టారా అనేది తెలియాల్సి ఉంది.

దీంతో… “బ్రో” సినిమాలో మంత్రి అంబటి రాంబాబు క్యారెక్టర్ ను కావాలనే సృష్టించి రాజకీయం చేసారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో ఒకవైపు గిల్లితే రెండో వైపు కూడా గిల్లించుకోవాలని అంటున్నారు. అసలు చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో పెట్టకుండా అన్యాయం చేశారని గతం గుర్తు చేస్తున్నారు. అప్పడు చిరంజీవి ఎక్కడున్నారని వైసీపీ నేతలు సూటిగా ప్రశ్నిస్తున్నారు.

ఏది ఏమైనప్పటికీ… చిరు యాక్షన్, వైసీపీ నేతల రియాక్షన్, మధ్యలో పవన్ కల్యాణ్ సైలెన్స్ చూస్తుంటే… త్వరలో చిరంజీవి జనసేనలోకి వచ్చే ఛాన్స్ ఉందని… పవన్ పై ప్రజల్లో అంత పాజిటివ్ ఆలోచనలు లేవు కాబట్టి… చిరంజీవిని సీఎం అభ్యర్థిగా పెట్టి ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఏమి జరగబోతోందనేది వేచి చూడాలి!