చిరంజీవి విషయంలో పవన్ కళ్యాణ్ సంయమనం కోల్పోతే.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపటినుంచి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో వారాహి విజయ యాత్ర ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో వారాహి విజయ యాత్ర సూపర్ హిట్ అయ్యిందని జనసేన వర్గాలు అంటున్నాయి. అందులో కొంత నిజం లేకపోలేదు కూడా.!

విశాఖపట్నం అంటే, గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయిన ‘గాజువాక’ నియోజకవర్గం కూడా ఇందులోనే వుంది. గతంతో పోల్చితే, విశాఖలో ఈక్వేషన్స్ ఇటీవలి కాలంలో అనూహ్యంగా మారాయి. జనసేనకు అనుకూలంగా పరిస్థితులున్నాయన్నది జనసైనికుల వాదన.

ఇదిలా వుంటే, మెగాస్టార్ చిరంజీవిపై వైసీపీ నేతల విమర్శల నేపథ్యంలో.. వారాహి విజయ యాత్ర వేదికపైనుంచి పవన్ కళ్యాణ్, వైసీపీ మీద కౌంటర్ ఎటాక్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై జనసేన అధినేత, పార్టీ ముఖ్య నేతలతో చర్చోపచర్చలు జరపడంలో వింతేముంది.?

అయితే, జస్ట్ అలా ఆ పాయింట్‌ని టచ్ చేసి వదిలెయ్యడమే బెటరని, పవన్ కళ్యాణ్‌కి నాగబాబు, నాదెండ్ల మనోహర్ తదితరులు సూచించినట్లు తెలుస్తోంది. సినిమాల్ని, రాజకీయాల్ని విడివిడిగా చూడండంటూ జనసేనాని సూచించిన దరిమిలా, జనసేన పార్టీ అధికార ప్రతినిథుల్లో ఇప్పటికే చాలా మార్పు వచ్చింది.

ఈ నేపథ్యంలో, జనసేనాని కూడా అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి వుంది వారాహి విజయ యాత్రలో. లేదంటే, తప్పుడు సంకేతాలు పార్టీ శ్రేణుల్లోకి వెళతాయి. మరోపక్క, జనసేనాని సంయమనం కోల్పోతారని వైసీపీ భావిస్తోంది. ఆ వ్యూహంతోనే, చిరంజీవి అంశాన్ని వైసీపీ తెరపైకి తెచ్చిందనీ అంటున్నారు.