వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నెలలకు కొదవే లేదు. 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో 30 శాతం మని మంత్రి పదవుల మీద ఆశలు పెట్టుకున్నారు. జగన్ అనుగ్రహం కోసం ప్రతిపక్షంలో ఉండగా శక్తివంచన లేకుండా కష్టపడ్డారు. అప్పట్లో జగన్ కూడ వారి పట్ల మంచి ఆధారం చూపేవారు. జగన్ వద్ద వారి పలుకుబడి చూసి మంత్రి పదవులు ఖాయమనుకున్నారు అంతా. తీరా గెలిచాక చాలామందికి తీవ్ర నిరాశే ఎదురైంది. అన్ని జిల్లాల్లోనూ మంత్రి పదవులు దక్కని అసంతృప్తులు చాలామందే ఉన్నారు. కానీ చిత్తూరు జిల్లా అసంతృప్తుల బాధ మిగతా జిల్లాల అసంతృప్తులతో పోలిస్తే విపరీత స్థాయిలో ఉంది.
మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకునేటప్పుడే జగన్ ఒక మాట చెప్పారు. ఇది కేవలం రెండున్నర సంవత్సరాల కాలానికేనని, ఆ తర్వాత విస్తరణలో భాగంగా మార్పులు ఉంటాయని అన్నారు. దాంతో అసంతృప్తులు రెండవ అర్ధభాగంలో అయినా పదవి దక్కకపోతుందా అనే ఆశాభావంతో ఉన్నారు. ఇంకొందరు అయితే ఈ ఐదేళ్ళలో కాకపొతే వచ్చే ఐదేళ్ళలో అయినా మంత్రి పీఠం ఎక్కవచ్చనే అంచనాలతో ఉన్నారు. కానీ తిరుపతి నేతలు మాత్రం మంత్రి పదవుల మీద పూర్తిగా ఆశలు వదిలేసుకున్నారు. వాళ్ళే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నగరి శాసనసభ్యురాలు ఆర్కే రోజా. ప్రస్తుతం వైసీపీలో ఫ్యూచర్ మీద అంతగా ఆశలు లేని ఫైర్ బ్రాండ్ లీడర్లలో వీరిద్దరి పేర్లే ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
ప్రతిపక్షంలో ఉండగా అసెంబ్లీలో కానీ బయటకానీ రోజా చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. తన వాగ్ధాటితో టీడీపీకి ముచ్చెమటలు పట్టించారు. ఏకంగా చంద్రబాబు నాయుడును ఏదో సీఎం అంటూ అసెంబ్లీ సస్పెండ్ అయ్యారు కూడ. అలా టీడీపీని గడగడలాడించిన రోజాకు మంత్రి పదవి దొరకలేదు. అందుకు కారణం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి . ఆయనకు మంత్రి పదవి ఇవ్వడంతో సామాజికవర్గ సమీకరణాల్లో భాగంగా రోజాకు మొండిచెయ్యి మిగిలింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన గత ఎన్నికల్లో జిల్లా మొత్తం వైసీపీ జెండా ఎగరడంలో ఎనలేని కృషి చేశారు. రోజానా, రామచంద్రారెడ్డా అనే పోలిక వస్తే అనుమానం లేకుండా జగన్ పెద్దిరెడ్డే అంటారు. పైపెచ్చు ప్రస్తుతం జిల్లాలో రోజా మీద అసమ్మతి వర్గం ఒకటి తయారవుతోంది.
ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడ ఇదే తరహా పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెవిరెడ్డి పార్టీని నిలబెట్టడం కోసం ఎంతో కృషి చేశారు. చంద్రబాబు ప్రభుత్వం నిధులు రాకపోవడంతో సొంత డబ్బు ఖర్చు చేసిన రోజులున్నాయి. పార్టీ శ్రేణులను కూడ అధిష్టానం నుండి సహాయం ఆశించకుండానే సొంతగా నడిపించారు. అందుకే గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో ఆయనకు 35,000 ఓట్ల మెజారిటీ అధికంగా వచ్చింది. ఆయనకు కూడ మంత్రి కావడానికి ఉండాల్సిన అర్థతలన్నీ ఉన్నాయి. కానీ రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు కావడంతో పదవిని పొందలేకున్నారు. పెద్దిరెడ్డి మంత్రిగా ఉండగా ఇంకొక మంత్రి పదవిని రెడ్డి వర్గం నేతకు ఇవ్వడం సమంజసం కాదు.
అందుకే ఆయనకు పదవి రాలేదు. భవిష్యత్తులో కూడ రామచంద్రారెడ్డి మంత్రి పదవి నుండి దిగే అవకాశామే లేదు. దీంతో చెవిరెడ్డి కూడ రోజా తరహాలోనే ఆశలను అటకెక్కించినట్టు కనిపిస్తున్నారు. ఈ ఇద్దరు నేతలకు కూడ రెడ్డి అనే ట్యాగ్ లేకుండా ఉంటే గనుక ఎవరో ఒకరికైనా పదవి దక్కి ఉండేది.