చిరుతపులి ఓ చిన్నారిని చంపేయడంతో, టీటీడీ మేల్కొంది. భక్తుల భద్రతపై మరింత దృష్టిపెట్టామని చెబుతోంది. టీటీడీ కొత్త ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించాక, వైసీపీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డికి ఎదురైన అతి పెద్ద సవాల్ ఇది.
గతంలో కూడా ఆయన టీటీడీ ఛైర్మన్‌గా పని చేశారు. అప్పుడూ తిరుమల కొండల్లో చిరుత పులుల సంచారం వుంది. కానీ, ఇన్నేళ్ళలో ఇలాంటి దాడులు జరగలేదు. ఇంతలా పెద్దయెత్తున చిరుత పులులు పట్టుబడుతున్నదీ లేదు.
తిరుమల కొండల్లో చిరుత పులుల సంచారం పెరిగిందా.? లేదంటే, శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ తాలూకు ప్రభావం చిరుత పులులపై పడిందా.? కారణం ఏదైతేనేం, ఓ నిండు ప్రాణం బలైపోయింది. ఇందులో టీటీడీ భద్రతా సిబ్బంది వైఫల్యం సుస్పష్టం.
ఈ నేపథ్యంలోనే, భక్తుల చేతికి కర్రల్ని అందించాల్సి వచ్చింది టీటీడీ. కర్రని చూస్తే, ఏ జంతువైనా కాస్త వెనక్కి తగ్గుతుంది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అది పులైనా, సింహమైనా.. ఇంకోటైనా.! అంతమాత్రాన, ఆ కర్ర ఆయా జంతువుల నుంచి మనిషికి రక్షణ కల్పిస్తుందా.? అంటే, కల్పించలేదన్నదీ నిర్వివాదాంశం.
ఏదో ఓ ప్రయత్నమైతే టీటీడీ చేసింది. కర్రలు పట్టుకుని తిరుమల కొండపైకి నడక మార్గంలో భక్తులు వెళ్ళడం ప్రారంభమైంది. అంతే, సెటైర్లు షురూ అయ్యాయి. ఈ నిర్ణయంపై మొదటి నుంచీ సెటైర్లు పడుతూనే వున్నాయ్.. ఇవిప్పుడు ఎక్కువయ్యాయ్.!
చిత్రంగా, కర్రలు చేతపట్టుకుని మెట్లెక్కుతున్న భక్తులూ, టీటీడీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ హాస్యాస్పద నిర్ణయం పట్ల, కామెడీలు చేసుకుంటున్నారు. ఎవరేమనుకున్నా, భక్తుల భద్రత విషయంలో వెనక్కి తగ్గబోమని కరుణాకర్ రెడ్డి చెబుతుండగా, కర్రల కాంట్రాక్టు ఎవరిది.? అంటూ భక్తులే ప్రశ్నిస్తుండడం గమనార్హం.