బాబు లేఖకు పుస్తకం రాసిస్తారంట!

మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు “వ్య‌వ‌స్థ‌ల దుర్వినియోగం, విధ్వంసం” గురించి రాష్ట్ర ప్ర‌జానీకానికి బ‌హిరంగ లేఖ రాశారు. అనపర్తిలో జరిగిన ఘటన, గన్నవరంలో జరిగిన దాడులు, తదనంతర పరిణామాలపై బాబు ఈ లేఖ రాశారు! దీంతో… గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాబు చేసిన వ్యవస్థల దుర్వినియోగం, విధ్వంసాల గురించి ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు!

ప్రభుత్వ వైఫల్యాలపై ఎవరూ ప్రశ్నించకూడదనే ఉద్దేశ్యంతోనే హింస, దాడులకు పాల్పడుతున్నారని.. గన్నవరం ఘటనలో బాధితులనే నిందితులుగా చేయడం దారుణమని.. చంద్రబాబు వాపోతున్నారు. జ‌గన్ రాజకీయ కక్షసాధింపునకు పోలీసులను వాడుకుంటున్నారని.. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని బాబు దుయ్య‌బ‌ట్టారు.

ఇంతవరకూ బాగానే ఉంది కానీ… అసలు బాబు తన హయాంలో చేసిన దారుణాలు, వ్యవస్థల దుర్వినియోగాలు, విధ్వంసాల గురించి అయితే లేఖలు సరిపోవని, అవి చాలా చిన్నవిగా ఉంటాయని.. బాబు తన పాలనలో చేసిన మూర్ఖపు చర్యలపై ఏకంగా పుస్తకాలే రాయొచ్చని చెబుతున్నారు వైసీపీ నేతలు! అందుకు వారు మచ్చుకు కొన్ని ఉదాహరణలను గుర్తుచేస్తున్నారు!

ఉమ్మడి రాష్ట్రంలో అంగన్ వాడీ టీచర్లు హైదరాబాద్ లో ధర్నా చేస్తున్నప్పుడు గుర్రాలతో తొక్కించిన ఘటన నుంచి.. బషీర్ బాగ్ లో రైతులపై జరిపిన కాల్పుల సంఘటన గురించి మొదలుపెడుతున్నారు వైకాపా నేతలు! ఇక విభజనాంధ్రప్రదేశ్ లో అయితే.. ముఖ్యంగా కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తాన‌ని ఇచ్చిన హామీని అమ‌లు చేయాల‌ని కాపు ఉద్య‌మ నాయ‌కుడు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం దీక్ష చేప‌డితే, ఆయ‌న‌తో పాటు కుటుంబ స‌భ్యుల్ని పోలీసుల‌ను అడ్డుపెట్టుకుని ఏవిధంగా హింసించారో గుర్తుచేస్తున్నారు! పోలీసులను అడ్డుపెట్టుకుని హింసించడంలో బాబు పీహెచ్డీ చేశారని వైస్సీపీ నేతలు కామెంట్ చేస్తున్నారు!

అలాగే వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు పార్ల‌మెంట్ సభ్యుల్ని త‌న పార్టీలో చేర్చుకోవడం, నిస్సిగ్గుగా బహిరంగంగా కండువాలు కప్పి పార్టీలో చేర్చుకోవడం.. వారిలో కొందరికి మంత్రి ప‌ద‌వులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్న వైసీపీ నేతలు… వ్య‌వ‌స్థ‌లను విధ్వంసం చేయ‌డంలో బాబుకి మించిన వారు లేరని చెబుతున్నారు!

తిరుపతి కొండమీద పనిచేసే త‌మ డిమాండ్ల‌ను నెర‌వేర్చాల‌ని కోరిన పాపానికి “తోక‌లు క‌ట్ చేస్తా” అంటూ వారి వృత్తిని ప‌రోక్షంగా కించ‌ప‌రిచిన చ‌రిత్ర చంద్ర‌బాబుది కాదా? అని వైసీపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు.

ఇలా చంద్రబాబు ప్రజలకు రాసిన తాజా బహిరంగ లేఖపై స్పందించిన వైసీపీ నేతలు.. గ‌తంలో బాబు చేసిన అప్ర‌జాస్వామిక పాల‌న జ‌నానికి బాగా తెలుస‌ని.. ప్రజలైతే మరిచిపోలేదని.. బాబు మరిచిపోయి ఉంటే.. ఒక పుస్తకం వేసి ఇస్తామని చెబుతున్నారు!