టిడిపి ఎంపిల్లో కొందరు సిట్టింగులకు షాక్ తప్పదా ?

రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ తరపున లోక్ సభకు పోటీ చేయబోయే వారిలో చాలా నియోజకవర్గాల్లో కొత్తముఖాలు కనబడే అవకాశాలున్నాయి. ఇప్పటికే చంద్రబాబునాయుడు అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు కూడా మొదలుపెట్టారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మొత్తం 25 నియోజకవర్గాల్లో 11 కోట్ల సిట్టింగ్ ఎంపిలకే టిక్కెట్లు దక్కుతాయి. మిగిలిన 14 నియోజకవర్గాల్లోనే ఏం చేయాలనే విషయమై చంద్రబాబు అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఈ 14 నియోజకవర్గాల్లో కూడా సుమారు 10 స్ధానాల్లో కొత్త అభ్యర్ధులే రంగంలోకి దిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి.  మిగిలిన నాలుగు చోట్ల మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. అందుకనే ఆ నాలుగు స్ధానాల్లో కసరత్తును కూడా ప్రస్తుతానికి పక్కనపెట్టేశారట.

 

పోయిన సారి పొత్తుల్లో భాగంగా బిజెపికి కేటాయించిన విశాఖపట్నం, రాజంపేట, తిరుపతి, నరసాపురం లోక్ సభ స్ధానాల్లో ప్రధానంగా కొత్త అభ్యర్ధులను చూస్తున్నట్లు సమాచారం. వాటితో పటు నరసరావుపేట, నంద్యాల నియోజకవర్గాల్లో కూడా గట్టి అభ్యర్ధుల కోసం చంద్రబాబు వేట మొదలుపెట్టారు.  అలాగే, పోయిన ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో అభ్యర్ధులను చివరి నిముషంలో కానీ ఫైనల్ చేయలేకపోయారు. దాంతో క్షేత్రస్ధాయిలో అభ్యర్ధులు కొంత ఇబ్బంది పడ్డారు. అందుకని వచ్చే ఎన్నికలకు అటువంటి పరిస్ధితి తలెత్తకుండా ముందుగానే అభ్యర్ధులను ప్రకటించాలని కూడా చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం.

 

అందులో భాగంగానే పోయిన ఎన్నికల్లో పోటీచేసిన 11 మందిని మళ్ళీ బరిలోకి దింపనున్నారు. ఈ జాబితాలో గెలిచిన వారితో పాటు ఓడిన వారు కూడా ఉండటం విశేషం. శ్రీకాకుళం నియోజకవర్గంలో కింజరాపు రామ్మోహన్ నాయుడు, విజయనగరం నుండి పూసపాటి అశోక్ గజపతిరాజు, అమలాపురం నుండి పండుల రవీంద్రబాబు, ఏలూరు నుండి మాగంటి బాబు, విజయవాడ నుండి కేశినేని నాని, మచిలీపట్నం నుండి కొనకళ్ళ నారాయణ, గుంటూరు నుండి గల్లా జయదేవ్, బాపట్ల నుండి శ్రీరామ్ మాల్యాద్రి, చిత్తూరు నుండి శివప్రసాద్, కర్నూలు నుండి ఫిరాయింపు ఎంపి బుట్టా రేణుక పోటీ చేసేది ఖాయమేనట. వీరిలో శివప్రసాద్, రవీంద్రబాబు, బుట్టా రేణుక, జయదేవ్ నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఎదుర్కొంటున్నా మళ్ళీ టిక్కెట్లివ్వాలని చంద్రబాబు నిర్ణయించారు.

 

కొత్తగా ఒంగోలులో పోయిన సారి  పోటీ చేసి ఓడిపోయిన ప్రస్తుత ఎంఎల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మళ్ళీ పోటీ చేయబోతున్నారు. మచిలీపట్నం నుండి తాను పోటీ చేయనని కొనకళ్ళ చెప్పినా చంద్రబాబు అంగీకరించలేదట. నరసరావుపేట నియోజకవర్గంలో తానే పోటీ చేస్తానని రాయపాటి సాంబశివరావు చెబుతున్నా అనారోగ్య  కారణాలతో ఆయన పోటీ చేసే అవకాశాలు లేవని పార్టీ అనుకుంటోంది.  రాజమండ్రిలో తానే పోటీలో ఉంటానని మురళీ మోహన్ చెబుతున్నా, ఆయనకన్నా ఆయన కోడలు రూప అయితే బాగుంటుందని స్దానిక నేతలు తీర్మానించి చంద్రబాబుకు చెప్పారట. ఇలా మరో నాలుగు సీట్లలో తప్ప మిగిలిన అన్నీ సీట్లలోనూ అభ్యర్ధుల ఎంపిక దాదాపు ఖాయమైపోయినట్లు పార్టీ వర్గాలు చెప్పటంతో ఎన్నికలు ఎప్పుడొచ్చినా చంద్రబాబు రెడీగా ఉన్నట్లు అర్ధమైపోతోంది.