65 – 35 ఈక్వేషన్ దిశగా టీడీపీ అధినేత చంద్రబాబు.!

టీడీపీ, జనసేన పొత్తు కుదురుతుందా.? కుదరదా.? పొత్తు కుదిరితే, టీడీపీ – జనసేన కూటమి అధికారంలోకి వస్తుంది. లేదంటే, వైసీపీ అధికారంలోకి వస్తుంది. పొత్తు కుదరని పక్షంలో, జనసేనకు అదనంగా వచ్చే నష్టమేమీ లేదు. కానీ, తెలుగుదేశం పార్టీ ఈసారి జీరో అయిపోతుంది.. ఇదీ రాజకీయ విశ్లేషకుల అంచనా.

అందుకే, మొదటి నుంచీ జనసేనపైకి వలపు బాణాలు విసురుతూనే వున్నారు టీడీపీ అధినేత. ‘వన్ సైడ్ లవ్ వల్ల ప్రయోజనం లేదు.. మనం అడుగుతున్నాం, వాళ్ళు స్పందించాలి కదా..’ అంటూ గతంలో చంద్రబాబు తెగ బాధపడిపోయారు. చివరికి చంద్రబాబు ప్రయత్నం ఫలించింది.. జనసేనాని కూడా సానుకూలంగా స్పందించారు.

కానీ, తెలుగుదేశం పార్టీకి ఏరు దాటాక తెప్ప తగలెయ్యడం బాగా అలవాటు. ఈ క్రమంలోనే, జనసేన తమతో పొత్తుకు సిద్ధమయిన దరిమిలా, జనసేనను తక్కువ చేసి చూడటం మొదలు పెట్టారు టీడీపీ నేతలు. జనసేనని దారుణంగా అవమానిస్తున్నారు. ఓ పది సీట్లు పారేస్తాం.. అంటూ టీడీపీ నేతలు సెటైర్లేస్తున్నారు.

మరోపక్క, ఈ కథంతా నడిపిస్తున్న చంద్రబాబు, జనసేనతో సంప్రదింపులు చేయకుండానే, పోటీ చేయబోయే అభ్యర్థుల్ని చూచాయిగా ఖరారు చేసేస్తున్నారు. దాంతో, జనసేనాని కూడా అభ్యర్థుల్ని ప్రకటించడం షురూ చేశారు. ఈ క్రమంలో రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరుగుతూ పోతోంది.

చేసేది లేక, టీడీపీ అధినేత చంద్రబాబు రాజీప్రతిపాదనలు తెరపైకి తెస్తున్నారట. 65 శాతం సీట్లలో టీడీపీ, 35 శాతం సీట్లలో జనసేన పోటీ చేసేలా ఓ ప్రతిపాదనను పవన్ కళ్యాణ్ ముందుంచారట. అంటే, దాదాపు 50 నుంచి 60 సీట్లలో జనసేన పోటీ చేయడానికి అవకాశం దొరుకుతోంది.

నిజమేనా.? దీనికి టీడీపీ కట్టుబడి వుంటుందా.? వెన్నుపోటు రాజకీయాలకు దిగుతుందా.? వేచి చూడాల్సిందే.